నేపాల్‌లోని సింధుపల్‌చౌక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. దీంతో ఖాట్మండు, తదితర ప్రాంతాల్లో నలుగురు గాయపడ్డారు. తెల్లవారు జామున 2.51 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం నమోదయింది. కాగా ఖాట్మండుకు తూర్పున 65 కిమీ. దూరంలో సింధుపల్‌చౌక్ జిల్లాలోని భైరబ్‌కుండ వద్ద భూకంప కేంద్రం నమోదయినట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ, రీసెర్చ్ కేంద్రం తెలిపింది. నేపాల్ దక్షిణ, తూర్పు ప్రాంత ప్రజలు భూకంపానికి చాలా భయపడ్డారు. కొన్ని చోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఖాటండులో ఇద్దరు, భూకంపానికి భయపడి చౌతర కారాగారం నుంచి తప్పించుకోబోయిన ఖైదీ, సింధుచౌక్ జిల్లాలోని ఏ వయోవృద్ధుడు గాయపడ్డారని అధికారులు తెలిపారు. నేపాల్ అత్యంత చురుకైన టెక్టోనిక్ జోన్‌లలో ఒకటి(సీస్మిక్ జోన్లు IV మరియు V), ఇది ఈ హిమాలయ దేశాన్ని భూకంపాలకు గురయ్యేలా చేస్తుంది. నేపాల్‌లో వచ్చిన అత్యంత విధ్వంసకర భూకంపం 2015లో వచ్చింది. అప్పుడు వచ్చిన భూకంపం రిక్టర్ సేలుపై 7.8 తీవ్రతగా నమోదయింది. నాటి ఆ భూకంపానికి దాదాపు 9000 మంది మరణించారు. పది లక్షల కట్టడాలు దెబ్బతిన్నాయి.