Monday, December 23, 2024

త్వరలో కాంగ్రెస్‌లో చేరబోయేదెవరు…?

- Advertisement -
- Advertisement -

మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న ప్రజా ప్రతినిధులు
చేరికలకు అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్
కాంగ్రెస్‌తో టచ్‌లోకి ఆరుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు

మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేది ఎవరన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. బిఆర్‌ఎస్‌కు చెందిన మరో 5 మంది ఎమ్మెల్సీలు, 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నట్టుగా తెలిసింది. అయితే వారంతా పార్టీలో చేరడానికి మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలిసింది. గురువారం రాత్రి బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యతో పాటు మరో ఐదుమంది ఎమ్మెల్సీలు గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ముఖ్యమంత్రి సమక్షంలో ఒకేసారి ఆరుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరి గులాబీ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీల్లో ఆదిలాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ భానుప్రసాద్, రంగారెడ్డి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్, గవర్నర్ కోట ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్, గవర్నర్ కోట ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యలు ఉన్నారు.

వచ్చే ఏడాది బస్వరాజ్ సారయ్య రిటైర్ కాబోతున్నారు. ఆయనకు రెన్యూవల్ కోసం కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈయనతో పాటు బుగ్గారపు దయానంద్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డిల పదవీకాలం మరో ఏడాదిలో ముగియనుంది. వీరితో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు, హెచ్‌ఎండిఏ పరిధిలోని ఇద్దరు, దక్షిణ తెలంగాణలోని ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తంగా ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన చేరికను జెడ్పీ చైర్ పర్సన్ సరిత వ్యతిరేకిస్తున్నారు. ఆమె శుక్రవారం సిఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో పరిస్థితిని వివరించినట్టుగా తెలిసింది.

ఆ ఇద్దరూ చేరేనా..?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే బస్వరాజు సారయ్య సొంత గూటికి చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ అధిష్టానానికి దూరంగా ఉంటూ వస్తున్న సారయ్య సిఎం వరంగల్ పర్యటనలో నేరుగా భేటీగా కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సారయ్యతో పాటు మండలి డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మరో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పేర్లు కూడా బలంగా వినిపించాయి. అయితే, గురువారం రాత్రి రేవంత్ సమక్షంలో సారయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోగా, వారిద్దరి చేరిక ఉంటుందా..? ఉండదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌లో త్వరలో చేరబోయేదెవరు అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌లో ఎదిగిన సారయ్య
కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బస్వరాజు సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిసి రజక సామాజిక వర్గానికి చెందిన ఆయన వరంగల్ మున్సిపాలిటీలో మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగాను ఆయన పని చేశారు. 1999లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటి చేసి టిడిపి అభ్యర్థి పూడి రమేష్ బాబుపై 9,251 ఓట్ల తేడాతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

10కి చేరిన ఎమ్మెల్సీల సంఖ్య
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలె యాదయ్య హస్తం తీర్థం పుచ్చుకోగా తాజాగా అదేబాటలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు సైతం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్యతో పాటు దండే విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేష్, బొగ్గవరపు దయానంద్‌లు పార్టీలో చేరారు. వీరితో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డిలతో కాంగ్రెస్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆరుగురు ఎమ్మెల్సీల చేరికతో కాంగ్రెస్ ఎమ్మెల్సీల బలం 10కి చేరింది.

21 మంది సభ్యులుంటే ఈజీగా బిల్లులు పాస్
ప్రస్తుతం కాంగ్రెస్‌కు అసెంబ్లీలో సరిపడా బలం ఉండటంతో ఈ సారి మండలిపై దృష్టి పెట్టింది. కీలక బిల్లులు పాస్ కావాలంటే మండలిలోనూ మెజార్టీ సభ్యులు కావాలి. కానీ, 40 మంది సభ్యులున్న శాసన మండలిలో కాంగ్రెస్ బలం కేవలం నలుగురే. 21 మంది సభ్యులుంటే ఈజీగా బిల్లులు పాసయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ప్రస్తుతం ఆరుగురి చేరికతో ఆ సంఖ్య 10కి పెరిగింది. 2019 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టి.జీవన్ రెడ్డి కొనసాగుతుండగా, తాజాగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల సెగ్మెంట్ నుంచి ఇటీవలే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచారు. దీంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. ఎంఐఎం, బిజెపిలకు ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News