లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో-బహ్రాయిచ్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జర్వాల్ రోడ్డులో బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో రూపాయిదీహ ప్రాంతం నుంచి లక్నో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి టివి ఫుటేజీ ఆధారంగా డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. చలికాలంలో తెల్లవారుజామున మంచు ఎక్కువగా కురుస్తుండడంతో ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.