Wednesday, January 22, 2025

మహారాష్ట్ర హ్యాండ్ గ్లౌస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

ఛత్రపతి శంభాజీనగర్ (మహారాష్ట్ర): మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా లో ఉన్న హ్యాండ్ గ్లౌస్ తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. జిల్లా లోని వలూజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సన్‌షైన్ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్‌లో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఫ్యాక్టరీ ఆవరణలో 13 మంది కార్మికులు నిద్రిస్తున్నారు.

వీరిలో ఆరుగురు చనిపోగా మిగతా ఏడుగురు ఫ్యాక్టరీ పైకప్పు పగులగొట్టి గాయాలతో బయటపడ్డారు. ఈ ఫ్యాక్టరీలో కాటన్, లెదర్ హ్యాండ్ గ్లౌస్ తయారు చేస్తుంటారని, రాత్రి 1.15 గంటల సమయంలో ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తెలిసిందని పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా వెల్లడించారు. అప్రమత్తం చేసిన తరువాత అగ్నిమాపక దళం వచ్చి తెల్లవారు జామున 3.30 గంటలకు మంటలు ఆర్ప గలిగారని తెలిపారు.

ఈ ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందన్నారు. గాయాలతో బయటపడ్డ కార్మికులకు వైద్య పరీక్షలు జరిగాయని చెప్పారు. ఈ జిల్లాకు చెందిన మంత్రి సందీపన్ భూమరే ఆదివారం ఉదయం ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ పైభాగంలో కార్మికులు నివసిస్తున్నారని, ఈ స్థలం పారిశ్రామిక ప్రయోజనం కోసమే తప్ప నివాసానికి కాదని కానీ దురదృష్ట వశాత్తు కార్మికులు ఇక్కడ నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణాలేమిటో దర్యాప్తు చేయాల్సిందిగా ఎలెక్ట్రీషియన్లను ఆదేశించడమైందన్నారు. ఆరుగురు మృతులను ఇంకా గుర్తించవలసి ఉందని ప్రభుత్వ మెడికల్ కాలేజీ , ఆస్పత్రి అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News