బహ్రాయిచ్ (యుపి) : ఉత్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్ జిల్లాలోని మసుపుర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఊరేగింపు జరుగుతుండగా హైటెన్షన్ విద్యుత్ తీగకు ఇనుపరాడ్డు తగిలి కరెంట్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఊరేగింపులో ఉపయోగించిన బండిలో ఉన్న ఇనుపరాడ్‌కు హైవోల్టేజీ విద్యుత్ తీగ తగలడంతో కరెంట్ షాక్ ఏర్పడిందని స్థానికులు చెప్పారు. మృతుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో బాలుడు ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతుల్లో అరఫాత్ (10).సుఫియా ( 12). ఇల్యాస్ (16), టబ్రేజ్ (16), అష్రఫ్ అలీ (30) నాన్‌పరా లోని భగ్గాడ్వా ప్రాంతానికి చెందిన వారు కాగా, షఫీక్ (12) ష్రవస్తి జిల్లా మల్హిపుర్‌కు చెందిన వాడుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరినీ నిందించవలసిన పనిలేదని, అందువల్ల మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ చేయవద్దని మృతుల తల్లిదండ్రులు పోలీసులను కోరారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.