Monday, December 23, 2024

ఆరు గ్యారెంటీల ఖర్చు రూ. 95 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

ఆరు గ్యారెంటీలు ఆచరణ సాధ్యమే…
ఆర్ధికవేత్తల ప్రాధమిక అంచనా
గ్యారెంటీల కోసం అదనపు నిధుల సమీకరణ
భారీగా పెరగనున్న 2024-25 ఏడాది బడ్జెట్
హామీల అమలు కోసం అప్పులు చేయక తప్పదు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను ఆర్ధిక ఇబ్బందుల నుంచి కాపాడటానికి, ప్రజల సుఖ, సంతోషాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన, ప్రజలు మెచ్చుకొన్న 6 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయవచ్చునని పలువురు సీనియర్ ఆర్ధికవేత్తలు వివరించారు. ఈ ఆరు గ్యారెంటీలు గొంతెమ్మ కోర్కెలేమీ కాదని, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఒక సంక్షేమ ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులేనని, అయితే ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ, ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూనే, రుణ పరిమితిని పెంచుకోవాల్సి ఉంటుందని ఆ ఆర్ధికవేత్తలు సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించి, ప్రజల మన్ననలను పొందటమే కాకుండా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం చేసి సంచలనం సృష్టించడంతో ఈ ఆరు గ్యారెంటీలు ఏమిటి, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వ ఖజానాపై అదనంగా ఎంత భారం పడుతుంది… ఆరు గ్యారెంటీల అమలుకు ఎంతమేరకు నిధులు అవసరవుతాయి… అనే అంశాలపై ఆర్ధిక నిపుణులు, ఆర్ధికశాఖలోని పలువురు సీనియర్ అధికారుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆరు గ్యారెంటీల అమలుకు మొత్తం సుమారు 94,156 కోట్ల రూపాయల (రూ.95 వేల కోట్లు) నిధులు అవసరమవుతాయని ప్రాధమిక అంచనాలో స్పష్టమయ్యిందని వివరించారు.

ఈనెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వెంటనే తాము ఆరు గ్యారెంటీలకు అదనపు నిధులు ఎంత మేరకు అవసరమవుతాయనే అంశాలపై లెక్కలు వేశామని, ఆ మేరకు ప్రాథమికంగా అంచనాలు రూపొందించగా 94,156 కోట్ల రూపాయలుగా తేలిందని, రానున్న రోజుల్లో లబ్దిదారుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున ఈ ఆరు గ్యారెంటీలకు 95 వేల నుంచి ఒక లక్ష కోట్ల రూపాయల వరకూ ఖర్చులు పెరుగుతాయని వివరించారు. అయితే ఈ ఆరు గ్యారెంటీలకు అవసరమైన నిధులన్నింటినీ ప్రణాళికా వ్యయంలోనే చూపించి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, రెవెన్యూ వ్యయం కింద కూడా నిధులను కేటాయించుకోవచ్చునని, ఈ ఆరు గ్యారెంటీల్లో సర్వీస్ సెక్టార్, సంక్షేమ రంగాలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయని, అందుచేతనే ప్లాన్ బడ్జెట్ (ప్రణాళిక వ్యయం) భారీగా పెరుగుతుందేమో, అందుకు నిధులను ఎక్కడి నుంచి తెస్తామనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

నాన్-ప్లాన్ బడ్జెట్ (ప్రణాళికేతర వ్యయం)లో కూడా ఈ ఆరు గ్యారెంటీలకు నిధులను కేటాయించుకొని ఖర్చులు చేసుకోవచ్చునని వివరించారు. అప్పులు ఎలా ఉన్నా… ప్రతి ఏటా చెల్లింపులు, వడ్డీల రూపంలో చెల్లింపులు చేసే ఖర్చులు ఏడాదికి సుమారు 13 వేల కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని, అయినప్పటికీ నిధులను ఆరు గ్యారెంటీలకు విజయవంతంగా ఖర్చు చేయవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో చివరి వరసలో ఉందని, రాష్ట్ర జిడిపిలో కేవలం 28 శాతం మాత్రమే అప్పులున్నాయని, దేశంలోని 28 రాష్ట్రాల్లో అప్పులు చేసిన రాష్టాల  జాబితాలోని వరుస క్రమంలో తెలంగాణ 23వ స్థానంలో ఉందని, మిగతా రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలన్నీ 30 శాతం నుంచి 46 శాతం వరకూ అప్పులు చేశాయని వివరించారు. న్యాయంగా, చట్టబద్ధంగా రుణాలను సేకరించుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇంకనూ ఎన్నో అవకాశాలున్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకొని కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ఈ ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయవచ్చునని ఆ అధికారులు వివరించారు.

ప్రజలు మెచ్చిన పథకాలకు ఖర్చు పెద్దదే…
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా లోకాన్ని విశేషంగా ఆకట్టుకొన్న వంటగ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు ఏడాదికి ఎనిమిది సిలిండర్ల లెక్కన గ్యాస్‌బండ సబ్సిడీ భారం 3,276 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని వివరించారు. అదేవిధంగా గృహజ్యోతి పథకంలో మహిళలకు నెలకు 2500 రూపాయల లెక్కన ఒక్కో మహిళకు ఏడాదికి 30 వేల రూపాయల లెక్కన 90 లక్షల కుటుంబాలకు ఏడాదికి 27,000 కోట్ల (27వేల కోట్లు) రూపాయల నిధులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలోని 45 లక్షల మంది పెన్షనర్లకు నెలకు 4 వేల రూపాయల లెక్కన ఏడాదికి 21,600 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని వివరించారు.

ఇక నిరుద్యోగ యువతను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం రేయింబవళ్ళూ కష్టపడి చేసిన యువతను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన “యువ వికాసం” పథకంలో 50 లక్షల మంది విద్యార్ధులకు ఏడాదికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలను చెల్లిస్తే రూ. 25,000 కోట్ల (25 వేల కోట్లు) రూపాయల నిధులు అవసరమవుతాయని వివరించారు. ఇక కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు గంపెడాశలు పెట్టుకొన్న 12 వేల రూపాయలను చెల్లిస్తే రాష్ట్రంలోని 54 లక్షల మంది కూలీలు, కౌలు రైతుల కోసం ఏడాదికి 6,480 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. గృహ విద్యుత్తులో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంటును సరఫరా చేస్తే రాష్ట్రంలోని 90 లక్షల ఇళ్ళకు ఏడాదికి 10,800 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుందని తెలిపారు.

ఇలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విలువ మొత్తం 94,156 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ప్రాథమికంగా తాము చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, భవిష్యత్తులో ఈ పథకాల అమలు కోసం రూపొందించే మార్గదర్శకాలు, లబ్దిదారులను గుర్తించేందుకు నియమ, నిబంధనలను ఖరారు చేసిన తర్వాత లబ్దిదారుల సంఖ్య పెరగుతుందా? తగ్గుతుందా…, ఈ గ్యారెంటీల ఖర్చు కూడా పెరుగుతుందా… తగ్గుతుందా… అనే అంశాలపై మరింత స్పష్టత వస్తుందని వివరించారు. అందుచేత పెరుగుతున్న ఖర్చులపై పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరంలేదని, లెక్కలన్నీ ఆచరణయోగ్యంగానే ఉన్నాయని ఆ అధికారులు వివరించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News