Saturday, January 18, 2025

చైనాలో నిమోనియా అలజడి.. భారత్‌లో ఆరు రాష్ట్రాలు అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనాలో నిమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కర్ణాటక ఆరోగ్యశాఖ రాష్ట్రంలో ప్రజలు సీజనల్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సీజనల్ ఫ్లూ లక్షణాలు, రిస్క్ గురించి ప్రకటన జారీ చేసింది. తుమ్ము,దగ్గు వచ్చినప్పుడు నోటిని, ముక్కును కవర్ చేసుకోవాలని, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడంతోపాటు రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని సూచించింది.

రాజస్థాన్ ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో ప్రస్తుతం పరిస్థితి ఏమంత ఆందోళనకరంగా లేకున్నా వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడంతోపాటు పీడియాట్రిక్ యూనిట్లతోపాటు మెడిసిన్ విభాగాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని కోరింది. గుజరాత్ ఆరోగ్యమంత్రి రుషికేశ్ మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యగా కరోనా సమయంలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలన్నిటినీ బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తమ ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకోవాలని అధికారులను కోరారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచాలని ఆరోగ్య అధికారులను ఆదేశించింది.

పైగా ఉత్తరాఖండ్ లోని చమోలి, ఉత్తరకాశీ, పిఠోర్‌గఢ్ ఈ మూడు జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. అందువల్ల మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. హర్యానా రాష్ట్రం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను అప్రమత్తం చేసింది. శ్వాసకోశ సమస్యల కేసులు వస్తే వెంటనే తెలియజేయాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఇదే విధమైన ఆదేశాలను తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు జారీ చేశాయి.

ఇప్పటివరకు పిల్లలకు సంబంధించిన న్యూమోనియా కేసులు నమోదు కానప్పటికీ, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరింది. ఒకవేళ ఏ కేసైనా నమోదైతే వెంటనే పరిష్కరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండేందుకు ఈ ఆదేశాలను జారీ చేసినట్టు పేర్కొంది. చైనాలో గత కొన్ని రోజులుగా చిన్నారుల్లో నిమోనియా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే తప్ప కొత్తగా వైరస్ కేసులేవీ లేవని చైనా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రాలకు లేఖ రాసి అప్రమత్తం చేసింది. మానవ వనరులు, ఆస్పత్రి పడకలు, ఔషధాలు, ఆక్సిజన్, యాంటీబాడీలు, పీపీఈ , టెస్ట్ కిట్ల తదితర అవసరాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News