మన తెలంగాణ/ములుగు క్రైం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలైన సంఘటన ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ పరిధిలోని ఎర్రిగట్టమ్మ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులంతా ములుగు జిల్లాలోని మంగపేట మండలం కోమటిపల్లి కెసిఆర్ కాలనీకి చెందినవారు. నాలుగు కుటుంబాలకు చెందిన వీరికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూంలు కేటాయించడంతో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి మొక్కులు చెల్లించి తిరిగివస్తున్న క్రమంలో ఈ ఘటన చోటచేసుకుంది. బొల్లెబోయిన రసూల్ నేతృత్వంలో వీరంతా గ్రామానికి చెందిన తునికి జాని ఆటోలో జాతరకు వెళ్లారు. ఇంచర్ల పంచాయతీ పరిధి ఎర్రి గట్టమ్మ వద్ద హరిత హోటల్ సమీపంలో.. ఏటూర్ నాగారం నుంచి హన్మకొండకు పశువులతో వస్తున్న డిసిఎం వ్యాన్ వేగంగా వచ్చి ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న రసూల్ కుమారుడు అజయ్(12), గాధం కౌసల్య (60), చెలమల్ల కిరణ్ కుమార్ (13), ఆటో డ్రైవర్ తునికి జానీ(23) అక్కడికక్కడే మృతి చెందారు. రసూల్, పద్మ, వసంత, వెన్నెలకు తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా రసూల్ కుమార్తె వెన్నెల (10), వసంత (50) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రసూల్, పద్మలు చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ములుగు ఏరియా ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎంఎల్‌ఎ సీతక్క పరామర్శించి ఓదార్చారు.
6 Killed in Road Accident in Mulugu