మధ్యప్రదేశ్ జూపార్కులో ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశంలో అంతరించిపోతున్న చిరుతపులుల సంతతిని వృద్ధి చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా వచ్చే ఆగస్టులోగా దక్షిణాఫ్రికా నుంచి చిరుతపులులను మధ్యప్రదేశ్‌లోని వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి రప్పించాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. చిరుతల సంరక్షణ కోసం మధ్యప్రదేశ్‌లోని కునోపాల్పూర్ నేషనల్ పార్కులో 10 చదరపు కిలోమీటర్ల ఎన్‌క్లోజర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు పర్యావరణ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. దక్షిణాఫ్రియా నుంచి కనీసం ఆరు చిరుతపులులను ఇక్కడకు తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి దక్షిణాఫ్రికాకు ఒప్పందం కుదిరిందని, దీనికి న్యాయ విభాగం కూడా ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ఏటా 8 నుంచి 10 చిరుతలను తీసుకురావాలని భావిస్తున్నామని, ఐదేళ్లలో వీటి సంఖ్యను 50కి పైగా పెంచాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికాకు చెందిన బృందం వచ్చే వారం పాల్పూర్‌ను సందర్శించి చిరుతల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించనున్నదని ఆయన చెప్పారు.