ఇండోర్: మధ్యప్రదేశ్‌లో పూర్తి కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న ఆరుగురికి కరోనా కొత్త రకం ఏవై.4 సోకినట్లు సోమవారం ఆరోగ్య అధికారులు తెలిపారు. ఢిల్లీలోని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్‌సిడిసి) నుంచి అందిన నివేదిక ప్రకారం వారీ విషయాన్ని తెలిపారు. ఆ ఆరుగురికి కరోనావైరస్ ఏవై.4 వేరియంట్ సోకిందన్నారు. వారి శాంపిల్స్‌ను జినోమ్ సీక్వన్సీకి పంపినట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సిఎంహెచ్‌ఒ) బిఎస్ సైత్య తెలిపారు. కరోనా మహమ్మారి 19 నెలల చరిత్రలో ఏవై.4 వేరియంట్ సోకడాన్ని కనుగొన్నారు. అది సోకిన ఆ ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చారు. చికిత్స అనంతరం వారు పూర్తిగా కోలుకున్నారని సైత్య తెలిపారు. అయితే ఆ ఆరుగురి కాంటాక్ట్‌లోకి వచ్చిన 50 మంది ఆరోగ్యంగానే ఉన్నారని ఆ ప్రధాన వైద్యాధికారి తెలిపారు.
ఇండోర్‌లోని గవర్నమెంట్ మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్‌లో మైక్రోబయోలజీ డిపార్ట్‌మెంట్‌కు అధిపతిగా ఉన్న డాక్టర్ అనితా ముథా మాట్లాడుతూ ఏవై.4 అనేది కరోనా వైరస్‌కు సంబంధించిన కొత్త రకమని, దాని తీవ్రత గురించిన సమాచారం అంతగా అందుబాటులో లేదని తెలిపారు.