ఆరుగురు అసోం పోలీసుల మృతి
అల్లరిమూకల దాడిలో మరో 50మందికి గాయాలు
గువహతి: మిజోరం సరిహద్దులో సోమవారం జరిగిన హింసలో అసోంకు చెందిన కనీసం ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 50మంది గాయపడ్డారని అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ తెలిపారు. గాయపడినవారిలో కాచార్ జిల్లా ఎస్‌పి నింబాల్కర్ వైభవ్ కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కాల్పులు నిరంతరంగా కొనసాగుతుండటంతో మరో సీనియర్ పోలీస్ అధికారి అక్కడి అడవిలోనే చిక్కుకుపోయారని ఆయన తెలిపారు. మిజోరంకు చెందిన అల్లరి మూకలు కాల్పులతోపాటు రాళ్లదాడికి పాల్పడుతున్నారని అసోం పోలీసులు తెలిపారు. సరిహద్దు ఘర్షణలకు పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయని అడవిలో చిక్కుకున్న సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వైభవ్ కాలికి బుల్లెట్ గాయమైనట్టు ఆయన తెలిపారు. తాను అడవిలోనే ఓ మూలకు దాక్కున్నానని, తన వెనక కాల్పుల శబ్దాలు ఇంకా వినపడుతున్నాయని ఆయన తెలిపారు.