Monday, December 23, 2024

ఆరుగురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులు

- Advertisement -
- Advertisement -

6 soldiers of Army, Assam Rifles awarded Shaurya Chakra

వీరిలో ఐదుగురికి మరణానంతరం

న్యూఢిల్లీ : ఆరుగురు జవాన్లకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. వీరిలో ఐదుగురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి. గత జులైలో జమ్ముకశ్మీర్‌లో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మద్రాస్‌కు చెందిన నాయిబ్ సుబేదార్ శ్రీజిత్ ఒక ఉగ్రవాదిని కాల్చిచంపి తనూ ప్రాణాలు కోల్పోయాడు. ఈయనకు మరణానంతరం శౌర్యచక్ర అవార్డు ప్రకటించారు. ఇక 2020 డిసెంబర్‌లో రాజ్‌పుత్ రెజిమెంట్‌కు చెందిన హవల్దార్ అనిల్ కుమార్ తోమర్ ఒక యాక్షన్ టీమ్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తూ ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈయనకు కూడా మరణానంతరం శౌర్యచక్ర అవార్డు దక్కింది. మరో హవల్దార్ కాశీరాయ్ బమ్మనహళ్లి కూడా ఒక ఉగ్రవాదిని కాల్చి చంపి తనూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో తన కమాండర్ ప్రాణాలు కాపాడాడు.

ఆయనకు కూడా మరణానంతం శౌర్యచక్ర అవార్డును ప్రకటించారు. పారిపోతున్న ఉగ్రవాదులను అడ్డగించి వారిపై కాల్పులు జరిపినందుకు జాట్ రెజిమెంట్‌కు చెందిన హవల్దార్ పింకూ కుమార్‌కు మరణానంతరం శౌర్యచక్ర అవార్డు దక్కింది. పింకూకుమార్ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవ్వగా, మరో ఉగ్రవాది తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పింకూ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. అదే విధంగా తెలుగువాడైన సిపాయి మారుప్రోలు జశ్వంత్ కుమార్ రెడ్డికి కూడా మరణానంతరం శౌర్యచక్ర అవార్డును ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ముఖాముఖి కాల్పుల్లో ఈయన ఒక ఉగ్రవాదిని హతమార్చాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో జశ్వంత్ రెడ్డి కూడా మరణించాడు. ఈ క్రమంలో జశ్వంత్ తమ టీమ్ కమాండర్ ప్రాణాలు కాపాడాడు. అదే విధంగా అసోంలో ఇద్దరు చొరబాటుదారులను తుదముట్టించినందుకు 5 అసోం రైఫిల్స్‌కు చెందిన రైఫిల్ మ్యాన్ రాకేష్ శర్మకు శౌర్యచక్ర అవార్డు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News