Saturday, November 23, 2024

కొత్త టెన్షన్

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్‌లో 60 మందికి బ్లాక్ ఫంగస్…!
వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు
గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరుగురు మృతి
కొవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త టెన్షన్
మెదడు, దవడ, కంటిపై తీవ్ర ప్రభావం
డయాబెటిస్, ఆస్తమా ఉన్నవారికి అత్యధిక ప్రమాదం
అప్రమత్తంగా ఉండాలంటున్న డాక్టర్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ భయపెట్టిస్తోంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సుమారు 60 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. గడిచిన 20 రోజుల్లో జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రుల్లో 50 మందికి బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు గుర్తించగా వీరిలో 16 మంది కోలుకున్నారని, మరో 10 మంది ఐసియూలో చికిత్సను అందిస్తున్నట్లు ఆ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. దీంతో పాటు ప్రైవేట్ ఈఎన్‌టి ఆసుపత్రుల్లో మరో 18 మంది చికిత్స పొందుతుండగా, గచ్చిబౌలిలో ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో 6 గురు బాధితులు బ్లాక్ ఫంగస్‌తో చనిపోయినట్లు సమాచారం. అయితే ఇలాంటి కేసులు ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఉండొచ్చని అధికారులూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ కేవలం కరోనా నుంచి కోలుకున్న కొందరిపై ఈ ఫంగస్ దాడి చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇది సుమారు 1 శాతం మందిలో మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు వారు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా మొదటి దశలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ అప్పట్లో వాటి ప్రభావం అతి తక్కువగా ఉండేది. కానీ సెకండ్ వేవ్‌లో దీని తీవ్రత అధికంగా ఉందని పలువురు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా స్టెరాయిడ్స్ వాడిన వారిలో ఇమ్యూనిటీ తగ్గి ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుందని వైద్యులు గుర్తించారు. ఇప్పటికే లాంగ్ కొవిడ్ సమస్యలతో కొంత మంది ఇబ్బందులు పడుతుండగా, కొత్తగా వచ్చిన ఈ బ్లాక్ ఫంగస్‌తో అనేక మంది టెన్షన్‌కు గురవుతున్నారు.
బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటీ..?
మ్యూకోర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) అనేది అరుదైన ఫంగస్. సాధారణంగా మట్టి, మొక్కలు,ఎరువుల్లో కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయాల్లో ఉండే బూజు లాంటి పదార్ధంతో ఇది తయారవుతోంది. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని నాశనం చేసే వ్యాధులైన హెచ్‌ఐవి, క్యాన్సర్ ఉన్న వారితో పాటు డయాబెటిస్, ఆస్తమా రోగులు, అవయవమార్పిడి చేసుకున్న వారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫంగస్ ఇమ్యూనిటీ శక్తి అధికంగా ఉన్న వారికి ఎలాంటి హానీ చేయదు. కానీ కొవిడ్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయిన వారిని మాత్రం వెంటాడుతుంది.
ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది..
బ్లాక్ ఫంగస్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముక్కులో ఉండే పల్చని ప్రదేశంపై దీని ప్రభావం మొదలై అక్కడి నుంచి కన్ను, పై దవడ ఎముక, మెదడుకు వ్యాపిస్తుంది. ఇది తన శక్తిని పెంచుకుంటూ రక్తనాళాలను క్షీణింపచేస్తుంది. దీంతో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి వివిధ అవయవాలపై ప్రభావం చూపుతోంది. అయితే దీని దీని నియంత్రణకు రెండు, మూడు మందులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేయవని డాక్టర్లు చెబుతున్నారు. సుమారు 80శాతం మంది ప్రాణాలు మాత్రమే కాపాడటం సాధ్యమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఇది కంటి, పై దవడ వరకు చేరితే వాటిని తొలగించాల్సి వస్తుంది. అంతేగాక మెదడు వరకు చేరితే పక్షవాతం రావడం, స్పృహ కోల్పోవడం, తొందరగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే దీన్ని ప్రారంభ ధశలో గుర్తిస్తే 15 నుంచి 20 రోజులు మందులు ఇచ్చి రోగిని కాపాడుకోవచ్చు. కానీ ఆలస్య సమయంలో గుర్తిస్తే డాక్టర్ల పర్యవేక్షణలో సుమారు 40 రోజుల వరకు మందులు ఇవ్వాల్సి ఉంటుంది.
ఎలా గుర్తించాలి..?
ముక్కులో నొప్పి, దురద వంటివి బ్లాక్ ఫంగస్‌కు మొదటి లక్షణం. ఈ సమయంలో ఎండోస్కోపిక్ పరీక్ష చేస్తే చర్మం డ్యామేజ్ అయిందా లేదా తెలుస్తుంది. నల్లని భాగం కనిపిస్తే అది బ్లాక్ ఫంగస్ అని నిర్ధారించాలని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఆ చర్మం పూర్తిగా క్షిణించిన తర్వాత నల్లని జిగురు పదార్థాలు ముక్కు నుంచి బయటికి వస్తాయి. తర్వాత స్టేజీలో విపరీతమైన కంటి, పంటి, దవడ ఎముక, తలనొప్పిని కలుగచేస్తుంది. మిగతా నొప్పుల కంటే ఈ నొప్పి తేడా ఉంటుంది. సాధారణ మందులతో ఈ నొప్పి తగ్గదు. ఇలాంటి లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్‌గా గుర్తించాలి. చూపు మందగించడం, కంటిలో నలుసు ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. సిటీ స్కాన్ చేసినా సాధారణ సైనసైటిస్‌గా తెలుస్తుంది కానీ, బ్లాక్ ఫంగస్‌గా గుర్తించలేము. వ్యాధి తీవ్రమైన వారిలో ఆపరేషన్లు చేసి కన్ను, పై దవడ వంటి భాగాలను తొలగించాలని వైద్యులు పేర్కొంటున్నారు.
వ్యాధికి ఇవే కారణాలు..
ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువున్న వారిపై బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది. కొవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ని ఇష్టారీతిగా వాడటం, రక్తంలో షుగర్ లెవల్స్ సరిగ్గా లేకపోవడంతో బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది.

60 Black Fungus Cases found in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News