Monday, December 23, 2024

60లక్షల టన్నుల ధాన్యం సేకరణ

- Advertisement -
- Advertisement -

60 lakh tonnes of grain procurement

ఎఫ్‌సిఐకి ప్రతి నెల 9లక్షల టన్నుల బియ్యం

యాసంగిలో తెలంగాణలో
ఉండే ప్రత్యేక వాతావరణ
పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని
రైతులకు సహకరించాలి
నూకలు అధికంగా
ఉండేటప్పటికీ సిఎం కెసిఆర్
ఆదేశాలతో అదనపు భారాన్ని
భరించి ధాన్యాన్ని కొంటున్నాం:
ఎఫ్‌సిఐ జిఎంతో మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో రైతుల నుంచి 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నట్టు రాష్ట్ర పౌర సరఫ రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్ల డించారు. శనివారం పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో బేటీ అయ్యారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఇతర పౌరసరఫరాల సంస్థ ఉన్నతోద్యోగులు పాల్గొన్నారు. ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మకు తెలంగాణ ఈ యాసంగిలో చేయబోయే ధాన్యం సేకరణ వివరాల్ని మంత్రి వెల్లడించారు, యాసంగిలో తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు, నూక శాతం ఎక్కువగా ఉండే నేపథ్యంలో సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అధనపు భారాన్ని భరించి ధాన్యం సేకరణ చేస్తున్నామనితెలిపారు. సీఎంఆర్ సమయంలో అనవసర కొర్రీలు పెట్టి ఇబ్బందులు సృష్టించవద్దని కోరారు. నాణ్యతా ప్రమాణాల మేరకు ముడి బియ్యం అందిస్తామని ఇందుకోసం లేఖల్ని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్.సి.ఐకు అందజేసామన్నారు.

ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బియ్యం విరుగుడు శాతం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఎఫ్.సి.ఐ ఎలాంటి అన్ రీజనబుల్ అబ్జెక్షన్స్ లేకుండా తీసుకోవాలని కోరారు. గత యాసంగిలో తీసుకోవాలస్సిన 5.25 లక్షల మెట్రిక్ టన్నులను ఫోర్టీఫైడ్ బాయిల్ రూపంలో తీసుకోవాలని, గత వానాకాలం సీఎంఆర్ వేగంగా అందించే విధంగా ర్యాకులు, అదనపు స్టోరేజీ కల్పించాల్సిందిగా కోరారు, సీఎంఆర్ గడువులో తక్కువ ధాన్యం సేకరించే రాష్ట్రాలకు అధికంగా సేకరించే తెలంగాణకు ఒకే గడువు ఇస్తున్న అసమగ్ర విధానాన్ని సైతం పున:సమీక్షించాలని, అధనపు గడువును సైతం కేవలం నెలరోజులకు మాత్రమే ఇస్తున్న అంశాన్ని దీపక్ శర్మ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాల్సిందిగా కోరారు. 35.80 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నులను సేకరిస్తున్నామని వీటికి 15కోట్ల గన్నీలు అవసరమని తెలిపారు. వీటి కోసం జూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసామని వారు సరఫరా చేయగా మిగిలినవి జెమ్ పోర్టుతో పాటు బహిరంగ వేలం ద్వారా సేకరిస్తామన్నారు. అలాగే యాసంగి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడడానికి ఎఫ్.సి.ఐ నుండి డిజిఎం కమలాకర్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ నుండి జిఎం రాజిరెడ్డిలను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్టు మంత్రి గంగుల కమాలాకర్ ఎఫ్‌సిఐ అధికారులకు వివరించారు.

పొరుగురాష్ట్రానుండి ధాన్యం రవాణకు అడ్డుకట్ట:

అనంతరం సివిల్ సప్లైస్ అధికారులతో జరిగిన సమీక్షలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగుల సూచించారు, రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాన్ని భరించి దేశంలో ఎక్కడాలేని విధంగా కనీస మద్దతు ధరతో ధాన్యం సేకరణ చేస్తున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుండి ఒక్క వడ్ల గింజ మన కొనుగోలు కేంద్రాల్లోకి రాకుండా చూడాలన్నారు. ఇందుకోసం విజిలెన్స్ బృందాలు పక్కా ప్రణాళికలతో ఈ రెండు నెలలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎలాంటి రీసైక్లింగ్ బియ్యం రాకుండా పటిష్ట చర్యలు తీసుకొని ఎక్కడి కక్కడ అదుపు చేయాలని, వాటిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయాలని అదేశించారు. రైస్ మిల్లర్ల వద్ద ఉన్న సివిల్ సప్లైస్ శాఖకు చెందిన గోనె సంచులను త్వరగా సేకరించాలని ఆదేశించారు.

జిల్లాల్లో సివిల్ సప్లైస్ డీఎంలు, డీఎస్వోలు నిరంతర పర్యవేక్షణ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎండలను తట్టుకునేలా నీడ సౌకర్యం ఏర్పాటు, మంచినీరు, అకాల వర్షాలు, గాలివానల నుండి రక్షణ చర్యలుగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు అవసరమైన మేర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు నిన్నటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని తెలిపారు.అనంతరం ధాన్యం సేకరణలో ఆర్థిక పరమైన అంశాలపై మంత్రి కమలాకర్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో బీఆర్కే భవన్లో బేటీ నిర్వహించారు, బ్యాంకు రుణాలకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ, గత బకాయిలు వంటి వాటిపై చర్చించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News