Friday, November 22, 2024

ఆగని ఇజ్రాయెల్ దాడులు..60 మంది పాలస్తీనియన్ల మృతి

- Advertisement -
- Advertisement -

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. ఉత్తర గాజా లోని బీట్ లాహియా నగరంలో ఓ నివాస భవనంపై మంగళవారం దాడి చేయడంతో 60 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గల్లంతయ్యారని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖకు చెందిన ఫీల్డ్ ఆస్పత్రుల డైరెక్టర్ డాక్టర్ మార్వాన్ అల్‌హామ్స్ వెల్లడించారు. మృతుల్లో 12 మంది మహిళలు, 20 మంది పిల్లలు, పసికందులు కూడా ఉన్నారని హెల్త్ ఎమర్జెన్సీ వెల్లడించింది. దాడుల్లో గాయపడిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోందని కమల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ హొస్సాం అబు సఫియా పేర్కొన్నారు. నిర్వాసితుల ఆశ్రయ స్థావరాలపై ఇజ్రాయెల్ మిలిటరీ అదే పనిగా దాడులు చేస్తున్నప్పటికీ, పాలస్తీనా ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని కచ్చితంగా వారిపైనే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే దాడుల్లో అధికంగా మహిళలు, పిల్లలే బలైపోతున్నారు. ఆస్పత్రులపై వరుస దాడుల్లో భాగంగా కమల్ అద్వాన్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో హమాస్ ఉగ్రవాదులను భారీ సంఖ్యలో అదుపు లోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది.

ఉత్తర గాజాలో జాబాలియా శరణార్థి శిబిరం పైనే ఇజ్రాయెల్ సైనిక దళాలు తాజాగా దృష్టి పెట్టాయి. ఈ దాడుల్లో వందలాది మంది బలయ్యారు. వేలాది మంది తమ ఇళ్లను విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. నిర్వాసితులకు సహాయం అందించడంలో విఫలమైతే మిలిటరీకి అందాల్సిన సహాయాన్ని తగ్గించవలసి వస్తుందని అమెరికా పదేపదే హెచ్చరించినప్పటికీ ఉత్తర గాజా ప్రాంతం బాధితులకు ఇజ్రాయెల్ సహాయం అందకుండా అడ్డుకుంటోంది. ఉత్తర గాజా లోని పాలస్తీనియన్లు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లకపోతే వారిని ఉగ్రవాదులుగా గుర్తించవలసి వస్తుందని ఇజ్రాయెల్ దళాలు హెచ్చరిస్తుండడంతో పాలస్తీనియన్లు భయపడుతున్నారు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ రెండు చట్టాలను ఆమోదించింది. దీనివల్ల పాలస్తీనియన్ శరణార్థులకు ఐక్యరాజ్యసమితి నుంచి అందవలసిన మానవతా సహాయం అందకుండా పోతుంది. ఇది ఐక్యరాజ్యసమితి లోని పాలస్తీనా శరణార్ధుల పునరావాస సంస్థ ( యుఎన్‌ఆర్‌డబ్లుఎ)కు వ్యతిరేక చర్యగా విమర్శలు వెల్లువెత్తుతుండగా, హమాస్ చొరబాట్లను అడ్డుకోడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఇజ్రాయెల్ సమర్థిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన దగ్గర నుంచి ఇంతవరకు 43,000 మంది పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంది. మొత్తం జనాభా 2.3 మిలియన్ మందిలో 90 శాతం మంది నిర్వాసితులయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News