ఫలితంగా క్యాన్సర్, గుండెజబ్బుల వ్యాప్తి…ఒఆర్‌ఎఫ్ అధ్యయనం హెచ్చరిక
కోల్‌కతా : ఒకసారి వాడిన వంట నూనెలో 60 శాతం మళ్లీ ఆహారం తయారీలో వినియోగమౌతోందని, ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటి దుష్పరిణామాలు సంక్రమిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. కొయాన్ అడ్వయిజరీ గ్రూప్, ఫిన్‌లాండ్ కేంద్రంగా గల నెస్టె సమన్వయంతో అబ్జర్వర్ రీసెర్చి ఫౌండేషన్ (ఒఆర్‌ఎఫ్) ఈ అధ్యయనం నిర్వహించింది. ఆహార పదార్ధాల తయారీ వ్యాపారులు ముఖ్యంగా చిన్నపాటి వ్యాపార సంస్థలు, వీధి వ్యాపారులు , తరచుగా ఒకసారి వాడిన వంట నూనెనే మళ్లీ (నల్లటి, పొగపట్టిన నూనెనే) ఆఖరి చుక్క వరకు వినియోగించి ఆహార పదర్ధాలు తయారు చేస్తుంటారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై తదితర నాలుగు మెట్రోసిటీల్లో వీధి వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలతోపాటు దాదాపు 505 (101 భారీ తరహా, 406 చిన్నతరహా )ఆహార వ్యాపారులను ఈ అధ్యయనంలో తీసుకున్నారు. వంట నూనెను తిరిగి వాడడం వల్ల నూనెలో ఫ్రీ రాడికల్స్ వెలువడుతాయని, ఈ ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ కారకాలని సికె బిర్లా ఆస్పత్రి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీస్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ జావేద్ వెల్లడించారు. గర్భాశయ క్యాన్సర్, ఆహార నాళ క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి సంక్రమిస్తాయని, ఒకసారి కూడా తిరిగి వంట నూనెలను వాడరాదని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నియంత్రణ సంస్థలు వంటనూనెల సక్రమ వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం దేశంలో ఒకసారి వాడిన వంట నూనెలను తిరిగి ఏ రూపంలోనైనా వాడడం నిషేధం. ఒకసారి వాడిన వంట నూనె తిరిగి సేకరించి బయోడీజిల్‌గా తయారు చేసే ఉద్యమాన్ని ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థ ( ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ప్రారంభించింది.