కేరళ లోని వయనాడ్ లోని ముండకై ప్రాంతంలో తేయాకు, కాఫీ, యాలకుల తోటలు విస్తారంగా ఉండడంతో ఈ తోటల్లో పని చేసేందుకు పశ్చిమబెంగాల్, అస్సాం నుంచి వందల కార్మికులు వస్తుంటారు. వీరిలో దాదాపు 600 మంది వలస కార్మికులు స్థానిక హారిసన్ మళయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పనిచేయడానికి వచ్చారు. వీరంతా ముండకై లోనే ఉంటున్నారు. ఇప్పుడు కొండచరియలు విరిగి పడిన విషాద సంఘటన తరువాత వీరి జాడ తెలియక పోవడంతో అధికారులతోపాటు అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. . కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ వారి ఆచూకీ గురించి ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
మా కార్మికులు ఎవరినీ ఇప్పటివరకు సంప్రదించలేక పోయామని జోన్స్ చెబుతున్నారు. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయడం లేదని ఆయన ఆందోళన చెందారు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు చాలావరకు మల్లప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదస్థలానికి చాలా దూరంలో దాదాపు 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం లోకి ఐదు మృతదేహాలు కొట్టుకువచ్చాయని స్థానిక ఆదివాసీలు తెలిపారు. ఎమ్‌ఎల్‌ఎ ఐసీ బాలకృష్ణన్ కూడా నదిలో అనేక శవాలు తేలుతున్నాయని చెప్పారు. ముండకై గ్రామంలో పరిస్థితి భయానకంగా ఉందని కాల్పెట్టా ఎమ్‌ఎల్‌ఎ టి సిద్ధిఖీ పేర్కొన్నారు.