పుణె: రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ బుధవారం తెలిపారు. ఇక్కడ ఓ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అక్కడ దాదాపు 20000 మంది చిక్కుపడగా, వారిలో 4000 మందిని ఫిబ్రవరి 24 నాటికి తీసుకొచ్చాం. మరో 2000 మంది విద్యార్థులను మంగళవారం వరకు తీసుకొచ్చాం. ఇంకా చిక్కుకుపోయి ఉన్న వారిని కూడా తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
చిక్కుకుపోయిన వారి సంఖ్య పెద్ద సంఖ్యలో ఉన్నందున వారిని భారత్ తెచ్చేందుకు రక్షణ రంగానికి చెందిన విమానాన్ని ఉపయోగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న రొమేనియా, పొలాండ్, హంగరీ, స్లోవేకియా వంటి దేశాల సహకారంతో విద్యార్థులను భారత్‌కు తరలిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఇదిలావుండగా ఉక్రెయిన్ నుంచి చిక్కుబడిన వారిని భారత్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ ఆరంభించింది. ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆపరేషన్ గంగ పేరును ఉపయోగించుకున్నారు’ అని శివసేన ఆరోపించింది. దీనికి మంత్రి ‘ఇది రాజకీయ అంశం కాదు, జాతీయ సమస్య. ఇది భారతీయుల రక్షణకు సంబంధించిన విషయం. ఆపరేషన్ గంగ పేరుపై ఎలాంటి అభ్యంతరరం ఉండడానికి వీలులేదు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన పుణెలో కలిశారు.