Saturday, November 16, 2024

సాగుకు రూ.60 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

60000 crores funds released to agriculture

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతుకుటుంబాల సంక్షేమమే లక్షంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఏటా బడ్జెట్‌లో రూ.60వేలకోట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న వానాకాల పంటలసాగుకు ఇటు అధికారులను అటు రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. వానాకాల పంటల సాగు సమాయుత్తంపై మంగళవారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల, వ్యవసాయం, ఉద్యాన, మార్కెంటింగ్ తదితర శాఖల ద్వారా ఎన్నో కార్యాక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. నీటిపారుదల రంగానికి రూ.25వేలకోట్లు,రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలతో వ్యవసాయ రంగానికి రూ.20వేలకోట్లు, ఉచిత విద్యుత్ కింద రూ.10వేలకోట్లు ఇలా వ్యవసాయంతో ముడిపడి ఉన్న ఆయా పథకాల ద్వారా రాష్ట్రప్రభుత్వం రూ.60వేలకోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్న ప్రత్యక్షదైవం రైతులే అన్నారు. అన్నిరంగాల్లోకెల్లా వ్యవసాయం అత్యంత పవిత్రమైన వృత్తి అని పేర్కొన్నారు.

జీవం పరిణామక్రమం నీటితోనే ప్రారంభమైందన్నారు.మనిషి పరిణామక్రమం మట్టితోనే ప్రారంభమైందన్నారు.రాష్ట్రంలో 60శాతం జనాభాకు వ్యవసాయమే జీవనాధారం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిచినట్టు తెలిపారు. రాష్ట్రంలోవున్న ప్రధాన వనరులను సద్వినియోగం చేసి ఎక్కవ మందికి జీవనోపాధి కల్పించటమే లక్షంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వర్షపునీటితోపాటు కృష్ణాగోదావరి జలాలను ఒడిసి పట్టి కోటిఎకరాలను సస్యశ్యామలంగా మార్చి ఉపాధి, ఆదాయ వనరులను పెంచతున్నామన్నారు. యాసంగి కింద దేశంలో 45లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 52లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగిందన్నారు. ప్రభుత్వం ఏటా ధాన్యం కొనుగోలు చేయటం సాధ్యపడదని, వ్యాపారం ప్రభుత్వ లక్షం కాదని మంత్రి రైతులకు సూచించారు.

పుష్కలంగా నీరు, విద్యుత్ లభిస్తుందని వాటి అధారంగా పంటల సాగులో ఆదాయం కంటే నష్టమే ఎక్కవ అన్నారు. తక్కువ నీటితో లాభాలను ఇచ్చే ఎక్కవ పంటలు పండించాలన్నారు. వానాకాలపు పంటలుగా కందికి మంచి డిమాండ్ ఉందన్నారు. గత సంవత్సరం 12లక్షల ఎకరాల్లో కందిసాగు చేశారని ఈ సారి ఈ పంటను 20లక్షల ఎకరాలకు పెంచాలని లక్షంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. పత్తిసాగులో తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉందన్నారు. వర్షాధారంగా పండిస్తున్న పత్తిని ఆరుతడి పంటగా మలిచి మంచి దిగుబడుల సాధించే దిశగా కృషి జరగాలన్నారు. తెలగాణపత్తి పంటకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న కారణంగా పత్తిసాగును 75లక్షల ఎకరాలకు పెంచాలని లక్షంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
త్వరలో వేరుశనగ పరిశోధనాకేంద్రం

రాష్ట్రంలో వేరుశనగ పంట సాగుకు అన్నివిధాల అనువైన నేలలు ఉన్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇసుక నేలలు , ఎర్ర నేలలు , ఇసుకతో కూడిన నల్లనేలలు ఈ పంటసాగుకు అనుకూలం అన్నారు. వేరుశనగలో మేలు రకం వంగడాలకోసం పరిశోధనలు జరుగుతున్నట్టు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా వేరుశనగ పరిశోధనాకేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అయిల్ పాం పంట సాగుకు తెలంగాణ ఎంతో అనుకూలం అని కేంద్రప్రభుత్వ సంస్థలు తేల్చాయన్నారు. 25జిల్లాలు ఈ పంట సాగుకు ఎంతో అనుకూలం అని నివేదిక ఇచ్చాయన్నారు. రాష్ట్రంలో 8.14లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు లక్షంగా చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని రకాల పంటలపైన సస్యరక్షణలో క్రిమిసంహారక మందుల పిచికారికి డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. తద్వారా యువతకు ఉపాధి కూడా పెరుగుతుందన్నారు. వ్యవసాయంలో అసరమైన అన్ని రకాల పనిముట్లను అందించి రాష్ట్రాన్ని యాంత్రీకరణ తెలంగాణగా మార్చుతున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ కుటుంబాలు పంటల సాగుతోపాటు పశుపోషణ, కోళ్లు ,మేకల పెంపకం, కూరగాయల సాగుతో అదనపు రాబడిని పెంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, తనకు , వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శికి కరోనా వచ్చిందన్నారు. మనం నేరాలు తప్పలు చేసేవారంకామన్నారు. ఆహారంలో శుద్దిలేకపోవటం వల్లనే శరీరంలో రోగనిరోధక శక్తితగ్గుతోందన్నారు. శుద్ధమైన ఆహారోత్పత్తులను అందించే రాష్ట్రంగా తెలంగాణను ఎదిగిద్దామన్నారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకం పెంచాలన్నారు. మనకష్టానికి మెళకువలను జోడించి మరింతగా పురోగమిద్దామని మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.

రైతుబంధు కార్యకర్తలకు గౌరవ వేతనం : పల్లా

త్వరలో రాష్ట్రంలోని రైతుబంధు కార్యకర్తలందరికీ గౌరవ వేతనం ఇచ్చే కృషి జరుగుతున్నట్టు రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. యాసంగిలో మంచి పంటలు పండాయన్నారు.రాష్ట్ర మంతటా రైతులనుంచి ధాన్యం సేకరణ జరుగుతోందని అకాల వర్షాలు కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 2602రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. రైతులకు లక్ష కళ్లాలు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు సంబంధించిన పనులు చేస్తూనే ఉందన్నారు. రాష్ట్రంలో 1.65లక్షల మంది రైతుబంధు కార్యకర్తలను గౌరవించుకుంటామని కరోనా కష్టాలు తొలగ్గానే ఆ కార్యక్రమం చేపడతామని రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డితోపాటు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News