Sunday, December 22, 2024

ఏడాది తిరక్క ముందే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ఆందోళనలు చేయొద్దు.. మా వద్దకు వచ్చి మాట్లాడండి
మీ అన్నగా సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నా
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం
బడ్డెట్ లో విద్య, వైద్యం, వ్యవసాయానిక పెద్దపీట వేశాం
ఫైర్‌మెన్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని ఆయన చెప్పారు. ఏడాది తిరక్క ముందే 60 వేల కొలువులు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇది ప్రజా ప్రభుత్వమని, నిరుద్యోగులు ఆందోళన చేయవద్దని తమ దగ్గరకు వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు.

మంత్రులు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మీ అన్నగా నిరుద్యోగుల సమస్యలు వినేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని సిఎం చెప్పారు. శుక్రవారం వట్టి నాగులపల్లిలోని అగ్ని మాపకశాఖ శిక్షణా కేంద్రలో 483 మంది ఫైర్‌మెన్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు సిఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో 157 మంది డ్రైవర్ ఆపరేటర్లకు సిఎం నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ఈ ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను, ఆస్తులను పరిరక్షిస్తున్న అగ్నిమాపక శాఖ తీరు అభినందనీయమన్నారు.

నాలుగు నెలలు కఠిన శిక్షణ తీసుకొని…
పరేడ్‌లో పాల్గొన్న ఫైర్‌మెన్‌లను చూస్తుంటే వాళ్ల తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తూ ఉంటారని అనిపిస్తోందన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారన్నారు. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ పత్రాలు అందుకున్న ఫైర్‌మెన్‌లు నాలుగు నెలలు కఠిన శిక్షణ తీసుకొని ప్రజా సేవకు సిద్ధమయ్యారన్నారు. కొందరు యువకులు ఉద్యోగాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా ఆదుకోవాలని సిఎం సూచించారు. తెలంగాణ ఏర్పాటు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోరాటాలు చేశారని, వారి ఆకాంక్షలను గత ప్రభుత్వం నెరవేర్చలేదని సిఎం ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్య, వైద్యం, సాగునీటి రంగాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించామని సిఎం చెప్పారు. 2 లక్షల 91 కోట్ల బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలిసేది కాదని, తాము మొదటి తారీఖునే జీతాలతో పాటు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలండర్ ఇస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలండర్ ఇస్తామని చెప్పారు. ఫైర్ సర్వీసెస్ డిజి నాగిరెడ్డి మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రతి జిల్లాకో ఫైర్ ఆఫీసర్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. అగ్ని ప్రమాదాలే కాకుండా ఎలాంటి విపత్తులు వచ్చినా ముందుండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News