Monday, December 23, 2024

కన్వీనర్ కోటాలో 62,079 ఇంజినీరింగ్ సీట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 137 ప్రైవేటు కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,713 ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ ఉన్నాయని తెలిపింది. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,302 సీట్లు ఉన్నాయని.. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. అత్యధికంగా సిఎస్‌ఈలో 15,897.. ఇసిఇలో 9,734 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. అలాగే సిఎస్‌ఇ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 7,854, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్‌లో 1,554 సీట్లు, సిఎస్‌ఇ(డాటా సైన్స్)లో 4,515, సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ)లో 1,344 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
జెఎన్‌టియుహెచ్‌లో 2,580 సీట్లు
రాష్ట్రంలో 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,713 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, అందులో అత్యధికంగా జెఎన్‌టియుహెచ్‌లో 2,580 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో 1,080 సీట్లు అందుబాటులో ఉండగా, ఉస్మానియా యూనివర్సిటీలో 630 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. అలాగే రెండు ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,302 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.
నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. బుధవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌తో పాటు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. మంగళవారం వరకు 54,029 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు బుధవారం నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జాగ్రత్తగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచించారు. కళాశాలల పేర్లు, కోడ్‌లు ఒకే రకంగా ఉన్నప్పుడు నమోదులో అయోమయానికి గురైతే కోరుకున్న కళాశాలకు బదులు మరో కళాశాలలో సీటు లభించే ప్రమాదం ఉంది. బి.టెక్ సిఎస్‌ఇ బదులు పొరపాటుగా సిఎస్‌సి అని ఆప్షన్ ఇస్తే సైబర్ సెక్యూరిటీలో సీటు రావొచ్చు. ఉత్తమ ర్యాంకు వచ్చినా పొరపాట్ల కారణంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదులో ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగే కీలకమని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే కళాశాలలు, వాటి ఎంసెట్ కోడ్‌లు, ఆసక్తి ఉన్న కోర్సులు, వాటి కోడ్‌లను వెబ్‌సైట్‌లో ఉన్న మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫాంపై రాసుకొని ఆప్షన్లు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News