గురువారం రికార్డు స్థాయిలో 6 లక్షల కేసులు
సియోల్ : దక్షిణ కొరియాలో కొవిడ్ స్వైరవిహారం ఆగడం లేదు. గురువారం కూడా రికార్డు స్థాయిలో 6,00,000 వరకు తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. గత జనవరి తరువాత ఇంత భారీ ఎత్తున రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గురువారం 6,21,328 వరకు రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ గురువారం వెల్లడించింది. అలాగే గురువారం 429 మరణాలు చోటు చేసుకున్నాయి. ఒక్క రోజులోనే కేసుల్లో 55 శాతం పెరుగుదల కనిపించింది. తాజా కేసులతో దక్షిణ కొరియాలో మొత్తం కేసులు 82,50,592 కు చేరాయని కెడిసిఎ వెల్లడించింది. ఆరోగ్య వర్గాలు ఊహించిన దాని కన్నా కేసులు అమాంతంగా స్థానికంగానే వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు. బుధవారం 4,00,000 వరకు కొవిడ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
మంగళవారం 24 గంటల్లో 293 మరణాలు సంభవించడం అత్యంత శోచనీయ దినంగా దక్షిణ కొరియా పేర్కొంది. మార్చి నెల మధ్యలో రోజువారీ కేసులు 1,40, 000 నుంచి 2,70,000 వరకు ఉండవచ్చని నెలరోజుల క్రితం దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ అంచనా వేసింది. కేసుల సంఖ్యతో నిమిత్తం లేకుండా దక్షిణకొరియా ప్రభుత్వం ఇప్పటికైతే ఆంక్షలను యథాతధంగా రోజులు, వారాలు కొనసాగించాలనే యోచనలో ఉంది. దీనికి ప్రజల మద్దతు లభిస్తోంది. ఆహార విక్రయశాలలకు రాత్రి 11 గంటల వరకు కర్ఫూ విధించింది. వ్యాక్సిన్ పాస్‌లు జారీ ఆపేసింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు వ్యాక్సినేషన్ ఇదివరకే పొందినట్టయితే వారికి క్వారంటైన్ ఉండాలన్న నిబంధన ఎత్తివేయాలని చూస్తోంది. ప్రయివేట్ సమావేశాల్లో ఆరుగురు కన్నా ఎక్కువ మంది ఉండరాదన్న పరిమితిని సడలించాలని యోచిస్తోంది. అయితే ఇండోర్, అవుట్‌డోర్ ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన కచ్చితంగా పాటిస్తున్నారు.