Monday, December 23, 2024

మన జైళ్లు భద్రం కాదా?

- Advertisement -
- Advertisement -

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో కేంద్ర కారాగారంలో 63 మంది ఖైదీలకు ఎయిడ్స్ మహమ్మారి సోకడంతో భారత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమాచారం దావానంలా వ్యాపించడంతో దేశ పౌరులు నిర్ఘాంతపోయారు. దీంతో మరోసారి మన దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవించే ఖైదీల స్వేచ్ఛకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. లక్నోలో తలెత్తిన సంఘటనతో జైళ్ల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కనీసం చీమను కూడా బయట నుంచి రానివ్వని అత్యంత దుర్భేద్యంగా ఉండే జైల్లో ఏకంగా 63 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎయిడ్స్ బారినపడ్డ రోగులను పరీక్షించిన ప్రత్యేక వైద్యులు వారిలో హెచ్‌ఐవి వైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో జైలు అధికారులే కాదు.. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు జైలర్‌పై చర్యలకు కూడా ఆదేశాలు చేసింది.

వాస్తవానికి గత ఏడాది సెప్టెంబరులో జైల్లోనే ఒక ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినప్పుడు తొలిసారి ఎయిడ్స్ నిర్ధారణ జరిగినట్లు తెలిసింది. అయితే ఈ సంఘటనను గుట్టు చప్పుడు కాకుండా అధికారులు వ్యవహరించారు. అనంతరం జైలులోని ఇతర ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అందరూ ఆశ్చర్య పోయేలా 36 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. తర్వాత కిట్స్ కొరత కారణంగా పరీక్షలు ఆపేశారు. ఇప్పుడు గత వారంలో ఒక రోగి ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో మరోసారి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఒళ్లు గగుర్పొడిచేలా దాదాపు 63 మంది ఖైదీలు మహమ్మారి బారిన పడినట్లు బహిర్గతమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే కారాగారంలో శిక్ష అనుభవించే ఖైదీలకు ఎయిడ్స్ సోకడం, అది తీవ్రంగా వ్యాప్తి చెందడం వెనుక భారీ కుట్రలే కనిపిస్తున్నాయి. దీనిని బట్టి కారాగారంలో తరచూ వ్యాధి నిరోధక పరీక్షలు నిర్వహించడం లేదనే వాదన వినిపిస్తోంది. వారికి క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తున్నారా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించే ఖైదీలకు వారానికోసారి ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించాలి. అది వారికి కల్పించిన పౌరహక్కు. కానీ లక్నోలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే అక్కడి జైలు అధికారులు వాటిని తుంగలో తొక్కి నిబంధనలు ఉల్లంఘించారు. ఫలితంగా 63 మంది దేశ పౌరుల ఆరోగ్యాన్ని కాలరాశారు. వెనుకబడిన దేశాల్లో తరచూ ఇలాంటి వార్తలను వింటుంటాము. కానీ మన దేశంలో ఇలాంటి ఘటనలు మానవాళిపై మాయని మచ్చలా కనిపిస్తోంది. జైలు అధికారులు ఈ వ్యవహారంపై నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వ్యాధి బారినపడ్డారు.

భిన్నంగా అధికారుల వాదనలు
లక్నో సంఘటనపై జైలు అధికారులు చెబుతున్న వాదన భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎయిడ్స్ సోకిన 63 మంది రోగులు మద్యం, సిగరెట్లు, ఇతరత్రా అలవాట్లకు బానిసలయ్యారని అందుకే వారికి ఎయిడ్స్ సోకిందని అంటున్నారు. పైగా వీరు జైల్లోకి వచ్చే ముందే ఎయిడ్స్ లక్షణాలతో వచ్చారని తెలిపారు. జైలు ప్రాంగణం వెలుపల కలుషితమైన సిరంజీలను ఉపయోగించడం వల్లే ఈ ఖైదీలు వైరస్‌కు గురయ్యారని తెలిపారు. కానీ, వైద్యుల వాదన మరోలా ఉంది. మదక ద్రవ్యాలు లేదా మద్యం, సిగరెట్లకు బానిస అయిన వారిలో ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయ వ్యాధులు మాత్రమే వస్తాయని ఇలా.. ఎయిడ్స్ సోకే అవకాశం లేదని అంటున్నారు. అసలు జైలు అధికారులు చెబుతున్న వాదనను పరిగణలోకి తీసుకుంటే కారాగారంలో శిక్ష అనుభవించే ఖైదీలకు మద్యం, సిగరెట్లు ఎక్కడ నుంచి సరఫరా అవుతున్నాయి, వారికి ఎవరు సరఫరా చేస్తున్నారు, జైల్లో కనీసం కల్పించే భద్రత ఇదేనా అనే ప్రశ్నలు ఉత్పన్నంకాక మానవు. మహమ్మారి భయానకంగా వ్యాప్తి చెందే వరకూ సిబ్బంది చేష్టలుడిగి ఎందుకు చూస్తున్నారనే ప్రశ్నకు సమాధారం రాబట్టాల్సిన అవసరం ఉంది.

కలుషితమైన సిరంజీలు వాడకం గురించి జైలు అధికారులకు అవగాహన కొరవడిందా లేదా ప్రేరేపిత చర్యల వల్ల ఇలాంటి దుష్పరిమాణాలు సంభవించాయా అనేది విచారించతగిన విషయం.ఏదైనా దీన్ని బట్టి జైళ్లలో ఉండే వ్యక్తి స్వేచ్ఛ హరించినట్లే అవుతుందని అభిప్రాయపడవచ్చు. ఇదిలావుంటే.. ఈ పరిస్థితిపై రాజకీయ దుమారం రేగకముందే యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం ఎయిడ్స్ సోకిన ఖైదీలకు లక్నోలోని ఓ ఆసుపత్రిలో రహస్య చికిత్స ప్రారంభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హెచ్‌ఐవి సోకిన ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ ఎలాంటి మరణాలు సంభవించకపోవడం గమనార్హమని అధికార పార్టీ బిజెపికి చెందిన ఓ ఎంఎల్‌ఎ కూడా దీనిపై తాజాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి జైళ్లలోనూ ఎయిడ్స్ సోకడం పట్ల దేశ వ్యాప్తంగా జైళ్లలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై కేంద్ర ఆరోగ్య సంస్థతో పాటు డబ్ల్యుహెచ్‌ఒ సుమోటోగా కేసు నమోదు చేయాలి. దీనికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన జైలు అధికారులుపై సత్వరమే చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తి స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన జైలు అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News