న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ కారణంగా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
కేరళలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు గత 24 గంటల్లో మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్ 5వ తేదీ వరకు దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు పదుల సంఖ్యను దాటలేదు. అయితే కొత్త వేరియంట్ బయటపడడం, వాతావరణ పరిస్థితులు మారడంతో రోజువారీ కేసుల సంఖ్య వందలకు పెరిగింది. కరోనా మహమ్మారి ప్రబలిన తొలి నాళ్లలో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షల్లో ఉండేది.
2020 ప్రారంభంలో మొదలైన కొవిడ్ మహమ్మారి గడచిన నాలుగేళ్లలో 4.5 కోట్ల మందికిపైగా ప్రజలకు సోకింది. దేశంలో ఇప్పటివరకు 5.3 లక్షల మంది కరోనా కారణంగా మరణించారు. కాగా వైరస్ బారిన పడిన దాదాపు 4.4 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 220.67 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్లు అందచేసినట్లు మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ పేర్కొంది.