బాగ్దాద్: దక్షిణ ఇరాక్‌లోని నసీరియా నగరంలో సోమవారం ఒక కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం 64కు పెరిగింది. అల్-హుస్సేన్ బోధనా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో చెలరేగిన మంటల్లో 100 మందికి పైగా రోగులు గాయపడ్డారని ఇరాకీ వైద్యాధికారులు తెలిపారు. కాగా, రోగుల బంధువులు తమ ఆప్తుల ఆచూకీ కోసం మంటల్లో దగ్ధమైపోయిన దుప్పట్లు, మంచాల శిథిలాల వద్ద మంగళవారం గాలిస్తున్న హృదయవిదారక దృశ్యాలు దర్శనమిచ్చాయి. దగ్ధమైపోయిన ఒక మహిళా రోగి పుర్రె వార్డులో కనిపించింది. రోగుల బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏమిటో వెల్లడించడానికి అధికారులు నిరాకరిస్తుండగా ప్రజలు మాత్రం ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి పెద్ద సంఖ్యలో రోగులు మరణించిన సంఘటన ఇరాక్‌లో ఈ ఏడాది ఇది రెండవసారి సారి. బాగ్దాద్‌లోని ఐబిఎన్ అల్-ఖతీబ్ ఆసుపత్రిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆక్సిజన్ ట్యాంకర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు 82 మంది రోగులు మరణించారు.
64 Corona Patients Died in Iraq Hospital Fire