అత్యధికంగా యుపిలో.. రెండవ స్థానంలో ఎపి
న్యూఢిల్లీ: కొవిడ్-19 సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నుంచి మే 28వ తేదీ వరకు మొత్తం 645మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి స్మతి ఇరాని సమాధానమిస్తూ అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 158 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోగా 119 మంది పిల్లలతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో 83 మంది, మధ్యప్రదేశ్‌లో 73 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారని మంత్రి తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేందుకు పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ పరిధిలో నిర్వహించే వివిధ పథకాల కింద వారికి ఆశ్రయమిచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె వివరించారు.
తమ తల్లిదండ్రులను లేక లీగల్ గార్డియన్‌ను లేక దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కరోనా వల్ల కోల్పోయిన పిల్లల కోసం ప్రధాని ఒక పథకాన్ని ప్రకటించారని మంత్రి తెలిపారు. అలాంటి ప్రతి చిన్నారికి 18 సంవత్సరాలు వచ్చే నాటికి రూ. 10 లక్షల కార్పస్ ఫండ్‌ను వారి విద్య, ఆరోగ్య అవసరాల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని, 18 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఐదేళ్ల పాటు వారి వ్యక్తిగత అవసరాలకు స్టైపెండ్ లభిస్తుందని, 23 ఏళ్లు చేరుకునే నాటికి వారి వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలకు కార్సస్ నిధి మొత్తం రూ. 10 లక్షలు అందుతుందని స్మతి ఇరాని వివరించారు.