న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం కారణంగా 1990 దశకం ప్రారంభంలో 64,827 కశ్మీరీ పండిట్ కుటుంబాలు కశ్మీరును వదిలి జమ్మూ, ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో తలదాచుకోవలసి వచ్చిందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. 202021 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను కేంద్ర హోం శాఖ నివేదిక ప్రకారం 1990 దశకం ప్రారంభం నుంచి 2020 వరకు జమ్మూ కశ్మీరులో తీవ్రవాద చర్యల కారణంగా 14091 మంది పౌరులు, 5,350 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల గుండా తీవ్రవాదులు చొరబాటు కారణంగా జమ్మూ కశ్మీరులో తీవ్రవాదం మరింత పెరిగిపోయిందని నివేదిక పేర్కొంది. తీవ్రవాదం కారణంగా కశ్మీరీ పండిట్లే కాక సిక్కులు, ముస్లిం కుటుంబాలు కూడా కశ్మీరు లోయను వదిలి జమ్మూ, ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసలు పోవలసి వచ్చిందని నివేదిక తెలిపింది. జమ్మూకు చెందిన పర్వత ప్రాంతాలకు చెందిన దాదాపు 1054 కుటుంబాలు జమ్మూలోని మైదాన ప్రాంతాలకు వలస పోయారని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్మూలో 43,618 కశ్మీరీ కుటుంబాలు, ఢిల్లీలో 19,338 కుటుంబాలు, 1,995 కుటుంబాలు ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో స్థిరపడినట్లు జమ్మూ కశ్మీరుకు చెందిన రిలీఫ్ అండ్ మైగ్రెంట్ కమిషనర్ వద్ద నమోదైన గణాంకాలు చెబుతున్నాయి.