Monday, April 14, 2025

కల్తీ కల్లు.. 65 మంది ఆస్పత్రిపాలు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గం, నస్రుల్లాబాద్ మండలంలో కల్తీ కల్లు బారిన పడిన వారి సంఖ్య మంగళవారం నాటికి 65 మందికి చేరింది. వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో పరిస్థితి సీరియస్‌గా ఉన్న 13 మందిని నిజామాబాద్, కామారెడ్డి ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ఇంతమంది కల్లీ కల్లు బారిన పడి అవస్థలు పడడానికి సూత్రధారులెవరు.. పాత్రధారులెవరో ఇంకా సంబంధిత అధికారులు తేల్చలేకపోయారు. ఈ సంఘటన జరిగి రెండు రోజులైనా కఠిన చర్యలు లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కల్తీ కల్లు బాధితులు ఆస్పత్రులపాలై నానాఅవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఎక్సైజ్ ఉన్నతాధికారులు బాన్సువాడ నియోజకవర్గంలోనే ఉన్నారు. ఇంత జరగడానికి కారణాలు ఇట్టే తెలిసిపోతున్నా ఏ ఒక్కరిలోనూ చలనం లేకపోవడాన్ని చూస్తే సంబంధిత అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తర్వాత పరిపాటిగా మారడాన్ని చూస్తే ఏ మేరకు బాధ్యులను వెనుకేసుకొస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది.

ఆకస్మిక తనిఖీలు లేవు… సంఘటన జరిగితేనే హడావిడి
కల్తీ కల్లు సంఘటన జరిగినప్పుడు సంబంధిత అధికారులు హడావిడి చేయడం తప్ప గతంలో ఆకస్మిక తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై చర్యలు లేకపోవడం, అలాగే నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు చేపట్టకపోవడంతో షరా“మాములే” అన్న చందంగా కొనసాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్తీకల్లు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఈ తరహా ఘటనలకు పునరావృతం కావొద్దు: ఎంఎల్‌ఎ పోచారం
చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే కల్తీ కల్లు కారకులను కఠినంగా శిక్షించాలని స్థానిక ఎంఎల్‌ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని సందర్శించి కల్తీ కల్లు సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, సంగెం, దామరంచ, దుర్కి తదితర గ్రామాలకు చెందినవారు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రి వద్ద విలేకరులతో మాట్లాడుతూ… అనుకోకుండా జరిగిన సంఘటన అని, మంచి జరిగింది కాబట్టి ఏం కాలేదని, లేదంటే ఎంతోమంది ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. పేద కుటుంబం వారు, కూలి, నాలీ చేసుకునేవారు కల్లు సేవిస్తారని, కల్తీ కల్లు ఏదో వారికి తెలియదన్నారు. మానసికంగా అలవాటుగా మారుతుందని, డ్రగ్స్ లాంటిదేనని అన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎక్సైజ్ ఉన్నతాధికారులు, నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, పిట్ల శ్రీధర్, మహ్మద్ ఎజాజ్, బాబా, యండి గౌస్, వైద్యులు, సిబ్బంది, ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులుఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News