Wednesday, January 8, 2025

జార్ఖండ్‌లో 65 శాతం ఓటింగ్

- Advertisement -
- Advertisement -

గిరిజన ఆధిక్యతల జార్ఖండ్‌లో బుధవారం అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా 65 శాతం మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఇది సాయంత్రం ఐదు గంటల వరకూ నిర్థారణ అయిన సమాచారం. తొలి విడతలో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. మాజీ సిఎం చంపై సోరెన్ , మాజీ ఎంపి గీతా కోరే వంటి ప్రముఖులు రంగంలో ఉన్నారు. ఈ సారి మొత్తం 683 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈసారి అత్యధికంగా లొహర్‌దగా జిల్లాలో 73 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. హజారిబాగ్ జిల్లాలో అత్యల్పంగా 59 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో తమ స్పందన వెలువరించారు. తొలిసారి ఓటేసేందుకు వెళ్లుతున్న యువ ఓటర్లకు , తన స్నేహితులకు అభినందనలు అని తెలిపారు. ముందు ఓటు తరువాతనే ఉత్సాహం ఉల్లాసం ఇది గుర్తు పెట్టుకోండని వ్యాఖ్యానించారు.

జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ తమ ఓటును రాంచీలోని ఎటిఐ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. ఓటర్లు అంతా తమ ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. . ఇది ప్రజాస్వామ్య పండుగ అని వ్యాఖ్యానించారు. సిఎం సోరెన్ ఓటుకు ముందు ప్రజలకు చేసిన విజ్ఞప్తిలో తమ ప్రభుత్వానికి మద్దతు తెలియచేయాలని అభ్యర్థించారు. వచ్చే ఐదేండ్లలో తాను పది సంవత్సరాలకు సరిపడా పనిచేస్తానని, ఇకపై ఏ శక్తి రాష్ట్ర ప్రగతిని ఆపే ప్రసక్తే లేకుండా చేసితీరుతామని ప్రకటించారు. తొలి దశ పోలింగ్‌లో ఇక్కడి ఓటరు అయిన ఒడిషా గవర్నర్ రఘువర్ దాస్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా , సరయూ రాయ్ వంటివారు కూడా ఓటేశారు. రాష్ట్ర మాజీ సిఎం చంపై సోరెన్ జంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి జెడియూ అభ్యర్థిగా నిలిచారు. అక్కడ తమ ఓటు హక్కు వాడుకున్నారు. మొత్తం 81 స్థానాల జార్ఖండ్‌లో జెఎంఎం , కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. జార్ఖండ్‌లో ఈ నెల 20వ తేదీన రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. 23వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.

ఓటేసిన క్రికెటర్ ధోనీ …సందడి
జార్ఖండ్ స్వస్థలం అయిన క్రికెటర్ ఎంఎస్ ధోనీ రాంచీలో ఓటేశారు. ఇక్కడ సతీమణి సాక్షితో కలిసి వెళ్లిన ధోనీని చూసేందుకు స్థానికులు సందడి చేశారు. వారిని వారిస్తూ ధోనీ కామ్‌గా వెళ్లి తమ ఓటేసి వెళ్లారు.
10 రాష్ట్రాలు , వయనాడ్ ఎంపి స్థానానికి ఉప ఎన్నిక
బుధవారం కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంతో పాటు దేశంలోని 10 రాష్ట్రాలలో 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఓటర్ టర్నవుట్ యాప్ సమాచారం మేరకు ప్రియాంక గాంధీ పోటీలో ఉన్న వయనాడ్‌లో 61 శాతం ఓటింగ్ జరిగింది. రాజస్థాన్‌లో ఏడు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు, అసోంలో ఐదు, బీహార్‌లో నాలుగు, కర్నాటకలో మూడు, మధ్యప్రదేశ్‌లో రెండు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘలయాల్లో ఒక్క స్థానం చొప్పున ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంజాబ్, యుపి, కేరళల్లో అవసరం అయిన మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలు ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాల పనితీరుకు పరీక్ష వంటివి అని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News