న్యూఢిల్లీ : స్థానిక అపోలో ఆసుపత్రిలో 65 ఏండ్ల వ్యక్తి యాంటీబాడీ కాక్‌టెయిల్ మందు వేయించుకున్నారు. పలు సుదీర్ఘ వ్యాధులు, దీనికి తోడు తీవ్రస్థాయి కరోనాతో చికిత్స పొందుతున్న ఈ వ్యక్తి రోచే ఇండియా యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను పొందిన తొలి వ్యక్తిగా నమోదు అయినట్లు హెల్త్‌కేర్ బృందం శుక్రవారం తెలిపింది. ఈ కరోనా రోగి ఈ కాక్‌టెయిల్ మందుకు బాగా స్పందించారు. శరీర వ్యవస్థలోకి నిర్ణీత స్థాయిలో ఈ సింగిల్ డోస్ ఔషధ ప్రసరణం జరిగిందని, ఓ గంట పర్యవేక్షణ ప్రక్రియ తరువాత ఈ వ్యక్తి ఇంటికి వెళ్లారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. స్వల్ప నుంచి ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉండే వ్యక్తులకు ఇటీవలే ఈ కాక్‌టెయిల్ ( కసిరివిమాబ్ , ఇండెవిమాబ్) ఔషధాన్ని సిప్లా సంస్థ విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మందు తీసుకుంటే కరోనా నుంచి రక్షణ పొందడం జరుగుతుంది. ఆసుపత్రిలో చికిత్సకు చేరాల్సిన అవసరం ఉండదని రోచే ఇండియా చెపుతోంది.