జెనీవా: ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే సిరప్‌లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్‌ల వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పలువురిలో కిడ్నీలు దెబ్బతినడానికి ఈ సిరప్‌లు కారణమయ్యాయని పేర్కొంది. ఈ మందులపై ఇతర దేశాలకూ డబ్లుహెచ్‌ఒ హెచ్చరిక జారీ చేసింది. గాంబియాలో మరణాలపై డబ్లుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ భారత్ లోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన సిరప్‌లు చిన్నారులను బలి తీసుకున్నాయని వెల్లడించారు. డబ్లుహెచ్‌ఒ దీనిపై విచారణ ప్రారంభించిందని చెప్పారు. చిన్నారుల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగు మందులు (ప్రొమెథజైన్ ఓరల్ సల్యూషన్, కొఫెక్స్‌మాలిన్ బేబే కఫ్ సిరప్, మేకొప్ బేబే కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్) హర్యానాలో తయారవుతున్నాయని డబ్లుహెచ్‌ఒ పేర్కొంది. వాటి భద్రత, నాణ్యతకు సంబంధించి ఆ కంపెనీ ఇప్పటివరకు డబ్లుహెచ్‌ఒకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపింది. ఈ మందులను ప్రస్తుతానికి గాంబియా లోనే గుర్తించామని, ఇతర దేశాలకు కూడా వీటి సరఫరా జరిగి ఉండొచ్చని డబ్లుహెచ్‌ఒ పేర్కొంది. మరింత నష్టం జరగక ముందే వెంటనే అన్ని దేశాలూ ఆ ఉత్పత్తులు ప్రజల్లో పంపిణీ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మందుల కారణంగా సెప్టెంబర్‌లో చిన్నారుల మరణాలు సంభవించినట్టు డబ్లుహెచ్‌ఒ తెలిపింది. లేబొరేటరీలో ఆ నాలుగు మందులనూ పరిశీలించినప్పుడు వాటిల్లో మోతాదుకు మించి డైథిలిన్, గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్టు గుర్తించామని పేర్కొంది.
రంగంలోకి కేంద్రం
గాంబియాలో మరణాలకు భారత్ కంపెనీ కారణమైందంటై డబ్లుహెచ్‌ఒ వెల్లడించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. చిన్నారుల మరణాలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ను డబ్లుహెచ్‌ఒ అలెర్ట్ చేసిన నేపథ్యంలో కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెంటనే రంగం లోకి దిగినట్టు తెలిపింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు డబ్లుహెచ్‌వో ఆరోపణలపై ఆ కంపెనీ ఇంతవరకు స్పందించలేదు.
66 Kids died with Indian Cough Syrups in Zambia