హుబ్బళ్లి (కర్ణాటక): కర్ణాటక లోని ధార్వాడ్‌లో ఎస్‌డిఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ మరోసారి కరోనా వ్యాప్తి చెందడంతో ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం 400 మంది విద్యార్ధుల్లో 300 మందికి కరోనా పరీక్షలు చేయగా ఈ 66 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు బయటపడింది. దీంతో వీరుంటున్న రెండు హాస్టళ్లను మూసివేశారు. ఇటీవల కాలేజీ కార్యక్రమంలో వీరంతా పాల్గొనడంతో వీరికి కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితేష్ పాటిల్ చెప్పారు. ఇప్పటికే విద్యార్థులంతా టీకాలు తీసుకోవడంతో వారిని క్వారంటైన్‌లో ఉంచినట్టు చెప్పారు. మిగిలిన 100 మందికి కూడా వైద్య పరీక్షలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే పరీక్షలు చేయించుకోని వారిని వేరే చోట క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఇప్పుడు కరోనా సోకిన వారంతా మొదటి సంవత్సరం విద్యార్థులు. విద్యార్థుల్లో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేరిన వారే. కాలేజీ ఆవరణ నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా పోలీసులు కట్టడి చేశారు.
ఒడిశా వైద్య కళాశాలలో 54 మందికి పాజిటివ్
ఒడిశా లోని విమ్సార్‌కు చెందిన వైద్య కళాశాలలో కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య 54 కు చేరింది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజుల పాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలకు ఇటీవల కాలేజీల్లో నిర్వహించిన
కార్యక్రమాలే కారణంగా భావిస్తున్నారు.