అఫ్ఘనిస్థాన్‌లో అసాధారణ, అల్లకల్లోల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ కుండపోత వర్షాలతో తలెత్తిన ఆకస్మిక వరదలతో కనీసం 68 మంది మృతి చెందారని తాలిబన్ ప్రభుత్వ అధికార వర్గాలు శనివారం తెలిపాయి. అయితే ఈ మృతుల సంఖ్య లెక్కలు అన్ని కూడా కేవలం ప్రాధమిక సమాచారం మేరకు క్రోడీకరించినవే. సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో వరద బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా అఫ్ఘనిస్థాన్‌లో వర్షాకాలంలో అతి తక్కువగా వానలు పడుతాయి. అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా పలు ప్రాంతాలలో అసాధారణ రీతిలో వర్షపాతం రికార్డు అయింది. పలు ప్రాంతాలలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రత్యేకించి ఘోర్ పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు తదనంతర వరదల ప్రభావం ప్రజలను కకావికలం చేసేసింది.
ఈ ప్రాంతపు గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ హమాస్ ఈ విషయం తెలిపారు. శుక్రవారం నుంచే వరదలు పంటపొలాలను, నివాసిత ప్రాంతాలను ముంచెత్తాయి. ఇంతవరకూ ఎప్పుడూ లేని విధంగా నీటి ప్రవాహాలు సుడులు తిరుగుతూ ఉండటంతో జనం దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఈ ప్రాంతపు రాజధాని ఫిరోజ్ కోతో పాటు పలు చోట్ల వ్యవసాయ భూములు నీట మునిగాయి. దీనితో ఈ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది. ఫర్యాబ్ ఉత్తర ప్రాంతంలో వరదల తాకిడితో , ఇళ్లు కూలిన ఘటనల్లో దాదాపు 20 మంది వరకూ మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. జరిగిన నష్టం తీవ్రస్థాయిలో ఉందని ఐరాస ఆహార భద్రత సంస్థ తమ సోషల్ మీడియా వేదికలో తెలిపింది. గతవారం కూడా అఫ్ఘనిస్థాన్‌లో ఆకస్మిక వరదలు ప్రళయాన్ని తలపించాయి. బగ్లాన్ ఉత్తర ప్రాంతంలో వరద ధాటికి 300మందికి పైగా దుర్మరణం చెందారు. పలువురు ఇప్పటికీ నిరాశ్రయులై ఉన్నారు.