Wednesday, January 22, 2025

అప్పుడు 720 ఇప్పుడు 682

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే 5న జరిగిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యుజిలో ఆరుగురు అభ్యర్థులు 720 మార్కులకు 720 మార్కులు సాధించిన హర్యానాలోని నీట్ పరీక్షా కేంద్రం లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరోసారి నిర్వహించిన పరీక్షలో ఒక్క అభ్యర్థి కూడా 682కి మించి మార్కులు సా ధించలేకపోయారు. బహదూర్‌గఢ్‌లోని హర్‌దయాళ్ పబ్లిక్ స్కూలులో రెండవసారి పరీక్ష నిర్వహించినపుడు 494 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో ఒకే ఒక్క అభ్యర్థికి అత్యధికంగా 682 మార్కులు లభించాయి. మరో 13 మంది విద్యార్థులకు 600 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. మే 5వ తేదీన జరిగిన పరీక్షకు సంబంధించిన ఫలితాలతో పోలిస్తే రెండవసారి పరీక్ష నిర్వహించినపుడు విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం గమనార్హం.

మే 5న జరిగిన పరీక్షలో ఒకే కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులకు 720కి 720 మార్కులు రావడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ మార్కులపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం కావడం, పరీక్షా పత్రం లీకేజీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్‌లో మళ్లీ పరీక్ష నిర్వహించింది. హర్‌దయాళ్ పబ్లిక్ స్కూలులో మే 5న జరిగినపరీక్షకు 500 మందికి పైగా అభ్యర్థులు హాజరుకాగా వీరిలో ఆరుగురికి 720 మార్కులు రాగా మరో ఇద్దరికి 718, 719 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ మార్కులే మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు దారితీశాయి.

సెంటర్, నగరాల వారీగా నీట్ యుజి ఫలితాలు విడుదల
వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యుజికి సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) శనివారం సెంటర్ వారీగా, నగరాల వారీగా ప్రకటించింది. అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీట్‌యుజి పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను సెంటర్ వారీగా, నగరాల వారీగా ఎన్‌టిఎ ప్రకటించింది. జూన్ 5న తొలుత ఫలితాలు ప్రకటించినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ పద్ధతిలో ఎన్‌టిఎ ఫలితాలను ప్రకటించింది. మే 5న నీట్ యుజి పరీక్ష జరిగింది. విదేశాలలోని 14 నగరాలతోపాటు దేశంలోని 571 నగరాలలోని 4,750 సెంటర్లలో నీట్ యుజి పరీక్ష జరుగగా 24 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.

నీట్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అభ్యర్థుల పేర్లు కనిపించకుండా ఫలితాలను ప్రకించాలని సుప్రీంకోర్టు ఎన్‌టిఎని ఆదేశించింది. ఇతర కేంద్రాలలో పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల కన్నా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సెంటర్లలో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చిందీ లేనిదీ నిర్ధారించడం కోసం సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జరీచేసింది. నీట్ యుజి పరీక్షను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జులై 22న సుప్రీంకోర్టు తన విచారణను కొనసాగించనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News