అమెరికా నుంచి జనవరి మొదలు ఇప్పటి వరకు మొత్తం 682 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. వారిలో చాలా మంది అక్రమంగా అమెరికాలోకి చొరబడినవారే. ఈ విషయాన్ని ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. బహిష్కరణ, చట్టబద్ధ చర్యలు, అమెరికాలో సరైన దస్తావేజులు లేని హోదా వంటి సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ పౌరులకు మద్దతు ఇస్తున్నామని, తగు చర్యలు చేపడుతున్నామని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్‌సభకు తెలిపారు.
2025 జనవరి నుంచి ఇప్పటి వరకు అమెరికా నుంచి 682 మంది భారతీయులను డిపోర్ట్ చేశారని ఆయన ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వంతో సహకరిస్తోందని కూడా ఆయన తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా ఎంత మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారన్న డేటాగానీ, ఏ రూట్‌లో వారు చొరబడిందన్న విషయం కానీ ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు.