న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సుమారు 18 నెలల కనిష్ఠానికి క్షీణించాయి. సోమవారం 10,79,384 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 6822 మంది వైరస్ బారిన పడినట్టు తేలింది. కేరళలో 3277 మందికి కరోనా సోకింది. అలాగే సోమవారం 10,004 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3.46 కోట్ల మంది మహమ్మారి బారినపడగా, 3.40 కోట్ల మంది కోలుకున్నారు. మరోపక్క క్రియాశీల కేసులు 554 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి.
ప్రస్తుతం బాధితుల సంఖ్య 95,014 కి తగ్గింది. క్రియాశీల రేటు 0.27 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 220 మరణాలు సంభవించాయి. ఒక్క కేరళ లోనే 168 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4.73 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక సోమవారం 79.3 లక్షల మంది టీకా వేయించుకోగా, మొత్తం మీద 128 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దని ప్రజల్ని అప్రమత్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23 కి చేరింది.