Monday, December 23, 2024

‘కట్టె’దుటే వినాయకుడు

- Advertisement -
- Advertisement -

Ganesh-Hospital

కుభీర్ మండలంలోని సిర్పేల్లి గ్రామానికి నాలుగు కి.మీ దూరంలో గల మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంలో దశాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్న కర్ర సత్య గణేషుడికి ఈ యేటితో 69 ఏళ్లు నిండాయి. ఈ కర్ర వినాయకుడిని భక్తుల కోరికలను తీర్చే ఇలవేల్పుగా కొలుస్తారు. 1948లో పాలాజ్ గ్రామంలో ప్లేగు, అతిసారం, కలరా వంటి వ్యాధులు ప్రబలి చాలా మంది మంచం పట్టి మరణించారు. గ్రామం దుర్భర పరిస్థితులతో సతమతమవుతున్న సమయంలోనే వినాయక చవితి పర్వదినం సమీపిస్తుండగా, గ్రామంలోని పెద్ద మనిషికి కర్ర వినాయకున్ని ప్రతిష్టించినట్లు కల వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు. ఈ విషయం తెలిసిన గ్రామంలోని పెద్ద మనుషులంతా కలిసి కర్ర వినాయకున్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు. నిర్మల్ పట్టణానికి చెందిన కళాకారుడు పాలకొండ గుండప్పను కలిసి కర్ర వినాయక విగ్రహాన్ని చేసి ఇవ్వాలని కోరారు. వెంటనే ఆయన నియమ నిష్టలతో వినాయక విగ్రహాన్ని చేసినందుకు గాను రూ. 51 లు తీసుకున్నట్లు స్థానికులు చెబుతుంటారు. కర్ర వినాయకున్ని ప్రతిష్టించినప్పటి నుంచి గ్రామంలో అంటువ్యాధులు తగ్గి అరిష్టాలు తొలిగి పోయాయి. పాడిపంటలు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలు కలిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటినుంచి ప్రతీ సంవత్సరం వినాయక చవితి రోజున కర్ర వినాయకున్ని ప్రతిష్టించి,దానికి ముందు మరో మట్టి విగ్రహాన్ని ఉంచడం సంప్రదాయం అయ్యింది. పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న కర్ర వినాయకున్ని చివరి రోజు ఉదయం నుంచే ప్రత్యేక రథంలో ప్రధాన వీధుల గుండా శోభాయత్ర నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రతీ ఇంటి వారు ఊరేగింపు జరుగుతున్న సమయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితి. ఉదయం ప్రారంభమైన నిమజ్జనోత్సవం మరుసటి రోజు తెల్లవారు జాము వరకు కొనసాగుతుంది. సమీపంలో ఉన్నా వాగు దగ్గరకు తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి, కర్ర వినాయకునిపై నీళ్లు చల్లి మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. తిరిగి కర్ర వినాయకున్ని ఆలయంలోని ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెలో భద్రపరుస్తారు. మిగతా రోజుల్లో విగ్రహం ప్రతిష్టించిన వేదికపై వినాయకుని చిత్రపటానికి భక్తులు మొక్కుతుంటారు. మహారాష్ట్రతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు కర్ర వినాయకుని దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు.
పదకొండు రోజుల పాటు పాలాజ్ గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళకుండా కర్ర వినాయకుని సేవలో ఉంటారు. ఇంటిలో ప్రతీ ఒక్కరూ వంతుల వారిగా సేవలో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News