న్యూఢిల్లీ : సోమవారం రాత్రి 694 మంది భారతీయ విద్యార్థులు సుమీ నుంచి పొల్‌టావకు బస్సులలో బయలుదేరారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు విద్యార్థుల తరలింపును నిర్థారించుకున్నట్లు వివరించారు. విద్యార్థులు బస్సులలో బయలుదేరినట్లు వివరించారు. కంట్రోలురూం నుంచి అన్ని వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. సుమీ నగరం నుంచి చిక్కుపడ్డ భారతీయ విద్యార్థుల సురక్షిత తరలింపు గురించి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉక్రెయిన్ , రష్యా నేతలతో ఫోన్‌లో మాట్లాడారు.
ఇప్పటివరకూ ఆపరేషన్ గంగ లో భాగంగా భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి 17,100 మంది భారతీయ పౌరులను దేశానికి తీసుకువచ్చింది. అయితే సుమీలో ఇప్పటికీ భారతీయ విద్యార్థులు చిక్కుపడి ఉన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితులలో ఉన్నారనే విషయాన్ని రష్యా ఉక్రెయిన్‌లకు భారతదేశం తెలిపింది. మరో వైపు ఉక్రెయిన్‌కు చెందిన మేకోలైవ్ రేవు వద్ద చిక్కుపడ్డ 75 మంది భారతీయ నావికులలో 52 మందిని స్వదేశానికి తరలించినట్లు ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. ఇతరులను కూడా భారత్‌కు పంపిస్తామని వెల్లడించింది.