ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దాదాపు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇది 2020 నాటి ఎన్నికల కన్నా ఎక్కువే. ఐదేళ్లకు పూర్వం ఢిల్లీ అసెంబ్లీకి పోటీచేసిన అభర్థులు 672 మంది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బిజెపి అభ్యర్థి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌తో తలపడుతున్నారు. న్యూ ఢిల్లీ నియోజకవర్గానికి అత్యధికంగా 23 మంది నామీనులు ఉండగా, జనక్‌పురిలో 16 మంది అభ్యర్థులు, రొహతాస్‌నగర్, కరవల్ నగర్, లక్ష్మీనగర్ నియోజకవర్గాల్లో 15 మంది అభ్యర్థుల చొప్పున బరిలో ఉన్నారు. దీనికి భిన్నంగా పటేల్ నగర్, కస్తూర్బా నగర్ నియోజకవర్గాల్లో ఐదుగురి చొప్పున అత్యల్పంగా అభ్యర్థులు పోటీపడుతున్నారు.
పటేల్ నగర్ సీటును 2020లో ఎస్సీ అభ్యర్థులకు రిజర్వు చేశారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 38 సీట్లకు 10 కంటే తక్కువ మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తిలక్‌నగర్, మంగోల్‌పురి, గ్రేటర్ కైలాష్ నియోజవర్గాల్లో ఆరుగురు అభ్యర్థుల చొప్పున, చాందినీచౌక్, రాజేంద్ర నగర్, మాలవీయ నగర్ నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు చొప్పున పోటీపడుతున్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ పార్టీలు మొత్తం 70 సీట్లకు పోటీపడుతుండగా, బిజెపి 68 సీట్లకు పోటీపడుతూ మిగతా రెండు సీట్లను జనతాదళ్(యునైటెడ్), లోక్‌తాంత్రిక్ జన్ శక్తి పార్టీలకు వదిలేసింది.
ఇక బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి) 69 నియోజవర్గాల్లో తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది.
వారం రోజుల్లో నామినేషేన్ విండోలో 981 మంది అభ్యర్థులు మొత్తం 1522 నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ విండో జనవరి 10 నుంచి పనిచేయడం ప్రారంభించింది. జనవరి 18న పరిశీలన జరుపగా, జనవరి 20న ఉపసంహరణలు జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనుండగా, ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.