Tuesday, November 5, 2024

అదానీ సోదరుడూ కుభేరుడే..

- Advertisement -
- Advertisement -

6th Richest Indian and richest NRI Vinod Shantilal Adani

అత్యంత సంపన్న ఎన్నారైగా వినోద్ అదానీ
ఆయన సంపద రూ.1.69 లక్షల కోట్లు
హిందుజా బ్రదర్స్ కూడా ఆయన తర్వాతే..

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు, వ్యాపారవేత్త వినోద్ శాంతిలాల్ అదానీ అత్యంత సంపన్ను ప్రవాస భారతీయుడిగా ఐఐఎఫ్‌ఎల్ హెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో స్థానం దక్కించుకున్నారు. జాబితాలో వినోద్ అదానీ రూ.1.69 లక్షల కోట్ల నికర విలువతో ఆరో అత్యంత సంపన్న భారతీయుడిగా కూడా ఉన్నారు. ఈ ఏడాదిలో 94 మంది ఎన్నారైలు ఈ జాబితాలో స్థానం పొందారు. అదే సమయంలో వినోద్ అదానీ ప్రవాసుల్లో కుభేరుడిగా ఎదిగాడు. హిందూజా సోదరులు కూడా ఆయన కంటే వెనుకే ఉన్నారు. హిందూజా బ్రదర్స్ సంపద రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. ప్రవాహ భారతీయుల్లో అమెరికా నుంచి 48 మంది జాబితాలో ఉన్నారు. రూ.70 వేల కోట్ల నికర విలువతో అమెరికాలో జయ్ చౌదరీ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. దుబాయ్‌లో నివసిస్తున్న వినోద్ శాంతిలాల్ అదానీకి సింగపూర్, దుబాయ్, జకార్తలో వ్యాపారాలు ఉన్నాయి. ఆయన 1976లో ముంబైలో టెక్స్‌టైల్ బిజినెస్‌ను ప్రారంభించి, ఆ వ్యాపారాన్ని సింగపూర్‌కు విస్తరించారు. అనంతరం 1994లో దుబాయ్‌కు వెళ్లిన తర్వాత మధ్యప్రాచ్యానికి తన వ్యాపారాన్ని తీసుకెళ్లారు.

2021లో రూ.37,400 కోట్లు పెరిగిన సంపద

గతేడాది(2021)లో వినోద్ అదానీ సంపదకు రూ.37,400 కోట్లతో 28 శాతం వృద్ధిని సాధించింది. అంటే ఆయన గత సంవత్సరంలో రోజుకు సగటున రూ.102 కోట్లు సంపాదించాడు. భారత్ టాప్ 10 రిచ్ లిస్ట్‌లో ఆయన రెండు స్థానాలు పైకి ఎగబాకారు. దీంతో తాజా జాబితాలో ఆయన ఆరో స్థానానికి చేరుకున్నారు. గత ఐదేళ్లలో వినోద్ అదానీ సంపద 850 శాతం పెరిగింది. అదే సమయంలో గత ఐదేళ్లలో గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలో సంపద 15.4 రెట్లు పెరగ్గా, వినోద్ అదానీ అండ్ ఫ్యామిలీ సంపద 9.5 రెట్లు పెరిగింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్2022లో గౌతమ్ అదానీ తొలిసారిగా రూ.10,94,400 కోట్ల సంపదను సంపాదించి, నంబర్ 1 స్థానంలో నిలిచారు. ఆయన గతేడాదిలో రోజుకు రూ.1600 కోట్లు సంపాదించాడని జాబితా వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News