Friday, November 22, 2024

కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట

- Advertisement -
- Advertisement -
కాబూల్‌లో తాలిబన్ల కవ్వింపు చర్యలు, గాలిలో కాల్పులతో గందరగోళం
ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు పౌరులు దుర్మరణం..పలువురికి తీవ్రగాయాలు

7 Afghan Civil died at Kabul Airport

కాబూల్: అఫ్ఘనిస్థాన్ విడిచిపెట్టివెళ్లాలనే క్రమంలో కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు అఫ్ఘన్ పౌరులు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని ఆదివారం బ్రిటిషష్ సైనిక వర్గాలు తెలిపాయి. ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు ఉరుకులు పరుగులపై వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు. దీనితో విమానాశ్రయం పరిసరాలలో జాతరను మించిన పరిస్థితి ఏర్పడుతోంది. గేట్లు దాటుకుని ఏదో విధంగా లోపలికి చొచ్చుకుపొయ్యే క్రమంలో గుంపులు గుంపులుగా జనం తోసుకుంటూ వెళ్లుతున్న క్రమంలో పరిస్థితి దిగజారుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకుని దేశం వదిలిపెట్టి పోవాలనే వారికి పలు దిక్కుల నుంచి మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతోంది. ఆదివారం ఎయిర్‌పోర్టుకు దారి తీసే ప్రాంతం వద్ద జనం ఆర్తనాదాలు, దిక్కుతోచనిస్థితిలో పలువురు కిందపడిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పౌరులను భయభ్రాంతులను చేసేందుకు తాలిబన్లు గాలిలో కాల్పులు జరిపిన దశలో మరింత అయోమయంతో జనం పరుగులు తీశారని, దీనితో తొక్కిసలాటకు దారితీసి, ఏడుగురు మృతి చెందారని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెన్ తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. ఓ వైపు అమెరికా ఎంబసీ వర్గాలు పౌరులకు దేశం విడిచిపెట్టే క్రమంలో తమ సూచనలు వెలువరిస్తున్నారు. దేశం విడిచివెళ్లే వారు ఎవరైనా ముందుగా తమకు తెలియచేస్తే వారి పూర్వాపరాలను తీసుకుని తాము వారికి వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని, ఆ తరువాతనే వారిని భద్రంగా ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లుతామని, ఇది తమ బాధ్యత అని, విడిగా ఎవరికి వారుగా ఎయిర్‌పోర్టు వెళ్లవద్దని సూచిస్తున్నారు. అయితే సంబంధిత విషయం గురించి తెలియని పౌరులు ఎయిర్‌పోర్టుకు తండోపతండాలుగా చేరుకోవడం కీలక పరిణామం అయింది. శనివారం నుంచి విమానాశ్రయం పరిసరాలను పూర్తి స్థాయిలో అమెరికా, బ్రిటన్ నాటో దేశాల సైనిక బృందాలు దాదాపుగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. జనం గుంపులుగా తోసుకుపోకుండా ఉంటేందుకు వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు 34 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండటంతో పరిసరాలలో చల్లటి వాతావరణం ఉండేలా చేసేందుకు నీటిని పైపులలో చల్లే ఏర్పాట్లు చేశారు. జనంలో పలువురు చెమటలతో సొమ్మసిల్లిపోతూ ఉంటే వారిని సైన్యం సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లి చికిత్స ఏర్పాట్లు చేస్తోంది.

ఓ వైపు ఐసిస్ ముప్పు హెచ్చరికలు:అమెరికా సైనిక విమానాలతో ఉద్రిక్తత

ఓ వైపు తాజాగా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ (ఐఎస్‌ఐఎస్) నుంచి విమానాల పేల్చివేత హెచ్చరికలు వెలువడటం మరింత గందరగోళానికి దారితీసింది. సాయుధులైన తాలిబన్లు గుంపులుగా ఉండటం, మరో వైపు అమెరికా సైనిక విమానాలు తమ పౌరులను తరలించేందుకు అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వచ్చిన దశలో తీవ్రస్థాయి ఉద్రిక్తత ఏర్పడుతోంది. సైనిక విమానాలు అత్యంత వేగవంతంగా, దాదాపుగా యుద్ధ సమయాలలో ల్యాండింగ్ తరహా హంగామాకు దిగడం, సాయుధులైన తాలిబన్లు వెలుపల నుంచి వీటిపై దృష్టి పెట్టడం. విమానాలు బయలుదేరి రన్‌వే పై వెళ్లే దశలో మరో విమానం నుంచి పెద్ద ఎత్తున కాల్పుల చప్పుళ్లు విన్పించడం, విమానాలపై క్షిపణి దాడుల ముప్పు ఉంటే అటువంటి టార్గెట్‌ను దారి మళ్లించడం వంటి పలు ప్రక్రియలు జరుగుతున్నాయి. దీనితో విమానాశ్రయం ఓ వైపు జనం గందరగోళం మరో వైపు వివిధ రకాల సైనిక విమానాల హడావిడితో క్రమేపీ ఇది ఓ చిన్నస్థాయి యుద్ధ క్షేత్రం అయిపొయ్యే పరిస్థితికి దారితీసింది. అయితే పౌర విమానాలకు ప్రత్యేకించి అమెరికా విమానాలకు ఐసిస్ నుంచి బెదిరింపుల విషయాన్ని నిర్థారించేందుకు, ఇతర వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ఇప్పటికైతే దాడులు లేవని, అయితే ఇంతకు ముందు ఈ దేశంలో అమెరికన్లకు వ్యతిరేకంగా ఐసిస్ చర్యలు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

7 Afghan Civil died at Kabul Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News