మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల నష్టపరిహారం : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురి గ్రామ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 60 గుడిసెలకు సంభవించిన ఘోర అగ్నిప్రమాదం లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి చెందారు. మొత్తం 60 గుడిసెల్లో 30 పూర్తిగా దగ్ధమయ్యాయి. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్లు రోషన్ (13), అతని చెల్లెలు దీపిక (9), మరో కుటుంబానికి చెందిన బబ్లూ (32),రంజిత్ (25), రేష్మా(18). ప్రియాంక (20). షహంష(10) ఉన్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మృతుల్లో పెద్దల కుటుంబాలకు రూ. 10 లక్షలు, పిల్లల కుటుంబాలకు రూ. 5 లక్షల వంతున నష్టపరిహారం ప్రకటించారు. మృతులు రోషన్,దీపిక తాతయ్య సాంతూ ( 58) తాము నిద్రలో ఉండగా ఈ ప్రమాదం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైందని, ఎక్కడ నుంచి ఎలా మొదలైందో తనకు తెలియలేదని చెప్పారు.
మేమంతా ఒకే గదిలో ఉండడంతో మంటలు కమ్ముకొచ్చేసరికి ప్రాణాలు దక్కించుకోడానికి గుడిసె నుంచి వెంటనే బయటకు వచ్చేశామని చెప్పారు. గోకుల్‌పురి గ్రామం స్తంభం 12 సమీపాన గుడిసెల అగ్నిప్రమాదం సంభవించిందన్న సమాచారం తమకు రాత్రి 1.03 గంటలకు అందిందని, వెంటనే ప్రమాద స్థలికి 13 అగ్నిమాపక శకటాలు వెళ్లాయని, చివరకు తెల్లవారు జామున 4 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పగలిగామని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్ అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియాల్సి ఉందని, రోహిణి నుంచి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బృందాలు ప్రమాద స్థలికి వెళ్లి పరిశీలిస్తున్నాయని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ కుమార్ మహ్లా చెప్పారు. ఈ ప్రమాదంలో మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేజ్రీవాల్
ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా పరిశీలించారు. బాధిత కుటుంబాలను కలుసుకుని ఓదార్చారు. ఉదయం లేవగానే ఈ విషాద సంఘటన విని దిగ్భ్రాంతి చెందానని అన్నారు. మృతుల కుటంబాలకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. నష్టపరిహారం నిధులు బాధిత కుటుంబాలకు వేగంగా అందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. ఈశాన్యఢిల్లీ బిజెపి ఎంపి మనోజ్ తివారీ ప్రమాదస్థలాన్ని సందర్శించారు. సంఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.