జమ్ము: జమ్ము నగరంలోని నర్వాల్ ప్రాంతంలో శనివారం రెండు పేలుడు ఘటనలు సంభవించాయి. ఇందులో కనీసం ఏడుగురికి గాయాలయ్యాయి. ఇంటలిజెన్స్ వర్గాల కథనం ప్రకారం ఆ ప్రాంతంలో అరగంటలోనే రెండు తీవ్రమైన పేలుళ్లు సంభవించాయి. ఉదయం 11 గంటలకు సంభవించిన మొదటి పేలుడులో ఐదుగురు గాయపడ్డారు. అది జరిగిన అరగంటకు రెండో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఇదిలావుండగా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. తొలి పేలుడులో మహేంద్ర బోలెరో వాహనాన్ని ఉపయోగించారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.
గాయపడిన వారిని సుహైల్ ఇక్బాల్(35), సుశీల్ కుమార్(26), విశ్వ ప్రతాప్(25), వినోద్ కుమార్(52), అరుణ్ కుమార్, అమిత్ కుమార్(40), రాజేశ్ కుమార్(35)గా గుర్తించారు. ఐఈడి పేలుళ్లు ఉధంపూర్ పేలుళ్ల మాదిరిగానే ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. పేలుళ్ల నిర్వహణ తీరు చూశాక అది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పనేమోననిపిస్తోంది.
వెంటనే పేలుళ్లకు గల కారణాలు గుర్తించాలని, కారకులపై చర్యలు చేపట్టాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశించారు.
“ఇలాంటి హీన చర్యలు వారి పిరికితనాన్ని చాటుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకోండి. కారకులను న్యాయస్థానం ముందు తీసుకురాడానికి అన్ని చర్యలు చేపట్టండి” అని లెఫ్టినెంట్ జనరల్ భద్రతాధికారులతో అన్నారు. ఈ పేలుళ్ల ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50000 నష్టపరిహారంను కూడా లెఫ్టినెంట్ జనరల్ ప్రకటించారు.