Wednesday, January 22, 2025

జైలులో నటుడు దర్శన్‌కు విఐపి సౌకర్యం..ఏడుగురు అధికారులు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప కస్టడీలో ప్రత్యేక సౌకర్యాలు అనుభవిస్తున్నట్లు సూచిస్తున్న ఫోటో, వీడియో వైరల్ కావడంతో దర్యాప్తు అనంతరం ఏడుగురు బెంగళూరు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ‘పోలీసులు అక్కడికి వెళ్లి, దర్యాప్తు చేశారు. అందులో ఏడుగురు అధికారుల ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు కనుగొన్నారు. ఆ అధికారులను సస్పెండ్ చేయడమైంది. ఇప్పుడు మేము ఆ వ్యవహారంపై మరింతగా దర్యాప్తు చేస్తున్నాం. అది భద్రతపరమైన లోపం’ అని కర్నాటక హోమ్ శాఖ మంత్రి జి పరమేశ్వర తెలియజేశారు. రేణుకాస్వామి హత్య కేసు సందర్భంగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ ఫోటో ఒకటి ఆన్‌లైన్‌లో బయటపడినప్పుడు ఆ వివాదం మొదలైంది. నటుడు దర్శన్ ఒక కుర్చీలో సిగరెట్, కాఫీ కప్‌తో చిద్విలాసంగా కూర్చుని మరి ముగ్గురు వ్యక్తులతో కలసి గడుపుతున్న చిత్రం అది. కొన్ని వార్తల ప్రకారం దర్శన్‌తో కనిపించినవారిలో నేరస్థుడు విల్సన్ గార్డెన్ నాగ, నటుని మేనేజర్, సహ నిందితుడు నాగరాజ్, మరొక ఖైదీ కుల్ల శీన ఉన్నారు.

దర్శన్ ఒక వీడియో కాల్‌లో మరొకరితో మాట్లాడుతున్నట్లు సూచిస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. ఆ సంఘటన విస్తృత స్థాయిలో విమర్శలకు దారి తీసింది. దర్శన్ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుండడంపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణుకాస్వామి హత్య సందర్భంగా దర్శన్ తన మిత్రుడు పవిత్ర గౌడ సహా మరి 16 మందితో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దర్శన్‌కు గల ఖ్యాతి దృష్టాను, నేర తీవ్రత దృష్టాను ఆ కేసు అందరి దృష్టీ ఆకర్షించింది. ఆ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులను శిక్షించాలని రేణుకాస్వామి తండ్రి కాశీరాథ్ ఎస్ శివనగౌడ్రు కోరారు. ‘అటువంటి పరిస్థితుల్లో సిబిఐ దర్యాప్తు జరగాలని భావిస్తున్నా’ అని ఆయన తెలిపారు. ‘అతను (దర్శన్) సిగరెట్ పట్టుకుని, టీ తాగుతూ ఇతరులతో కలసి కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. అతను జైలులో ఉన్నాడా లేదా అని అనుమానిస్తున్నాం. జైలు జైలుగానే ఉండాలి తప్ప మరొక విధంగా కాదు. ఇతర మామూలు ఖైదీల వలె అతని పట్ల ప్రవర్తించాలి. కానీ అతను ఒక రిసార్ట్‌లో కూర్చున్నట్లుగా ఉన్నట్లు కనిపిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News