Thursday, January 23, 2025

కోల్‌కతాలో భవనం కూలి ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం కూలి ఇద్దరు మహిళలతో సహా కనీసం ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు, అనేక మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. భవనం కూలిన 16 గంటల తరువాత శిథిలాల కింద కనీసం నలుగురు చిక్కుకుపోయినట్లు గుర్తించడంతోను, వారిలో ఒకరే ప్రాణంతో ఉన్న సూచనలు కనిపించడంతోను మృతుల సంఖ్య పెరగవచ్చునని రక్షణ, సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్న అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు సూచించారు. భవన నిర్మాణం అక్రమంగా జరుగుతున్న ఆ ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన రక్షణ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ తెలిపారు. భవనం ప్రమోటర్ మహమ్మద్ వసీమ్‌ను అరెస్టు చేసినట్లు, చట్టం ప్రకారం కఠిన చర్య తీసుకోనున్నట్లు మేయర్ చెప్పారు.

నగర పశ్చిమ పరిధిలోని అజాన్ మొల్లా లేన్‌లోని భవనం కూలిన ప్రదేశాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోగలమని స్థానికులకు మమత హామీ ఇచ్చారు. భయంకరమైన ప్రమాదంలో నిర్మాణంలోని ఐదు అంతస్తుల భవనం ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో కూలిందని మేయర్ హకీమ్ తెలియజేశారు. ‘శిథిలాలలను తొలగించి, బాధితులను చేరుకునేందుకు మేము గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాలు వాడుతున్నాం. బాధితుల వద్దకు మేము చాలా జాగ్రత్తగా వెళుతున్నందున ఎక్కువ సమయం పడుతోంది’ అని అగ్నిమాపక శాఖ అధికారి వివరించారు. శిథిలాలు భారీగా పేరుకుపోయినందున చిక్కుకుపోయినవారి వద్దకు చేరుకోవడం రక్షణ, సహాయక సిబ్బందికి కష్టం అవుతోందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News