టీకా మందును స్టోరేజీ కేంద్రాలకు తరలించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాట్లు
ప్రత్యేక విమానంలో రానున్న వ్యాక్సిన్ నిల్వలు
స్పెషల్ స్టోరేజీ బాంకులతో సిద్ధంగా ఉన్న వాహనాలు
టీకాలు ఇవ్వాలని రిటైర్డ్‌స్టాఫ్ విజ్ఞప్తి
ముందుకు వచ్చిన ప్రైవేటు రంగం
రవాణాకు 104 గిఫ్ట్ ఎ స్మైల్ అంబులెన్స్‌లు
నేడు కేంద్ర ఆరోగ్య మంత్రితో పరోక్ష భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: మరో రెండ్రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కొవిషీల్డ్ డోసులు రానున్నాయి. ఇప్పటికే సెంట్రల్ ఆఫీసర్లు ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు చేరవేశారు. దీంతో వాటిని స్టో రేజ్ కేంద్రాలకు తరలించేందుకు ఆ రోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చే స్తుంది. ప్రత్యేక విమానం ద్వారా ఎయిర్‌ఫోర్డ్‌కు వచ్చే వ్యాక్సిన్‌ను నిల్వ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను కూడా సిద్ధం చేశారు. ఆ వాహనాల్లో ప్లస్ 2 నుంచి ప్లస్ 8 శీతల పరిస్థితులు ఉండేలా స్పెషల్ బాక్సులను ఏర్పాటు చేయబోతున్నారు. అంతేగాక వ్యాక్సిన్ తరలించే ప్రక్రియలో డోసులకు ఎలాంటి డ్యామేజ్ కలుగకుండా ఈ బాక్సులను తయారు చేసినట్లు ఆరోగ్యశాఖలోని ఓ ముఖ్య అధికారి తెలిపారు. వాస్తవంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్లలో ఇప్పటి వరకు సుమారు 2.95 లక్షల మంది కోవిన్ సాప్ట్‌వేర్‌లో నమోదు అయ్యారు. వీరిలో 50 శాతం సర్కార్ హాస్పిటల్స్‌లో పనిచేసే వారు ఉండగా, మిగతా వారు ప్రైవేట్‌లో పనిచేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే వీరందరికి తొలి రౌండ్‌లో వ్యాక్సిన్ వేసేందుకు సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ 7 లక్షల కొవిషీల్డ్ డోసులను రాష్ట్రానికి పంపనుంది. మరోవైపు ట్రాన్స్‌పోర్ట్, పంపిణీలలో డ్యామేజీలు అయినప్పటికీ డొసుల కొరత లేకుండా వీటికి అదనంగా సుమారు మరో 5 శాతం డొసులు అడిషనల్‌గా వస్తున్నాయని రాష్ట్ర అధికారులు తెలిపారు.
రెండు సెక్టార్‌గా విభజించి టీకాలు….
వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హెల్త్ కేర్ సిబ్బందిలను రెండు సెక్టార్‌గా విభజించి టీకా పంపిణీ చేయాలని ఆరోగ్యశాఖ సూత్రపాయంగా నిర్ణయించింది. దీనిలో భాగంగా పబ్లిక్ హెల్త్ , డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలో వచ్చే వర్కర్లను వేర్వేరుగా విభజించి టీకాను పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. అంతేగాక వ్యాక్సిన్ స్వచ్ఛందమే అయినప్పటికీ, అందరూ టీకా వేసేలా ప్రణాళికలు సిద్ధం చేయడం కూడా సులువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
టీకాలు ఇవ్వాలని వైద్యశాఖకు విజ్ఞప్తి చేస్తున్న రిటైర్డ్ స్టాఫ్…
వీలైతే తమకూ హెల్త్ కేర్ వర్లర్కుగానే పరిగణించి టీకాలు ఇవ్వాలని రిటైర్డ్ స్టాఫ్ వైద్యశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈమేరకు ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి అధికారులకు ఇప్పటికే వినతి పత్రాలు కూడా అందించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా రిక్వెస్ట్‌లు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో వైద్యం అందిస్తున్న ఆర్‌ఎంపి ఉద్యోగులు కూడా టీకా కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే టీకాలు ఇవ్వడం జరుగుతోందని హెల్త్ ఆఫీసర్లు తేల్చిచెప్పారు. దేశ వ్యాప్తంగా కోవిన్ సాప్ట్‌వేర్‌లో రిజిస్టర్ అయినోళ్లకు మాత్రమే టీకాను ఇవ్వడం జరుగుతోందని అధికారులు అంటున్నారు.
ఆక్స్‌పర్ట్ టీకా రాకతో హెల్త్ కేర్ సిబ్బందిలో పెరిగిన మనోధైర్యం…
ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనిక్ భాగస్వామ్యంతో పూణేలోని సీరమ్ సంస్థ ఉత్పత్తి చెస్తున్న కొవిషీల్డ్ రాష్ట్రానికి వస్తుందన్న సమాచారంతో హెల్త్ కేర్ సిబ్బందిలో మరింత మనోధైర్యం పెరిగింది. ఈ టీకా ఇప్పటికే పూర్తిస్థాయిలో క్లినికల్స్ ముగించుకొని 94 శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని నివేదికను విడుదల చేసింది. దీంతో ఈ టీకాను వేసుకునేందుకు వైద్యసిబ్బంది ఆసక్తి చూపుతున్నారు.
ముందుకు వచ్చిన ప్రైవేట్ సెక్టార్…
గత కొన్ని రోజుల క్రితం హెల్త్ కేర్ వర్లర్ల డేటా ఇవ్వాలని వైద్యశాఖ అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించింది. కానీ వారు టీకాను తీసుకునేందుకు అనాసక్తి చూపారు. కనీసం డేటా సైతం ఇవ్వకుండా వైద్యశాఖకు సహకరించలేదు. కానీ కొవిషీల్డ్‌కు అనుమతులు రాగానే ఆయా ఆసుపత్రులు కూడా డేటా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఆరోగ్యశాఖలోని ఓ అధికారి‘ మన తెలంగాణకు’ తెలిపారు.
ట్రాన్స్‌పోర్టేషన్‌కు 104, గిప్ట్ ఏ స్మైల్ అంబులెన్స్‌లు వినియోగం…
టీకా పంపిణీ కార్యక్రమంలో స్టాఫ్ తరలించేందుకు, టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ తేలిన వారిని ఆసుపత్రులకు పంపించేందుకు 104, గిప్డ్‌ఏ స్మైల్ కార్యక్రమం సందర్బంగా వచ్చిన అంబులెన్స్‌లను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసిన అంబులెన్స్‌లను కూడా వాడనున్నారు. ప్రతి ఐదు నుంచి 10 వ్యాక్సిన్ బూత్ సెంటర్లకు ఒక్కో అంబులెన్స్ చొప్పున అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
అన్ని రాష్ట్రాల హెల్త్ మినిస్టర్లతో నేడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వర్చువల్ మీట్…
వ్యాక్సిన్ పంపిణీ, నిల్వలపై నేడు అన్ని రాష్ట్రాల హెల్త్ మినిస్టర్లతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వర్చువల్ మీట్‌ను నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో ఏ తేదిన వ్యాక్సిన్ ఇవ్వనున్నారు? సాధారణ ప్రజలకు ఎప్పుడు ఇస్తారు? అనే అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేగాక ఈ రోజు సాయత్రం కానీ శుక్రవారం వరకు వ్యాక్సిన్ పంపిణీ తేదిని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
7 lakh covishield doses might be issued to Telangana