న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ తిరిగి చేపట్టాలనే డిమాండ్ రానురాను పార్టీ వర్గాల్లో ఊపందుకొంటోంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాలని కోరుతూ పలు రాష్ట్రాలు తీర్మానాలను ఆమోదిస్తున్నాయి. ఈమేరకు మొట్టమొదట రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేయగా, ఇదే బాటలో ఏడు రాష్ట్రాలు ఇప్పటివరకు తీర్మానాలను ఆమోదించాయి. 2017లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేముందు కూడా ఇదే విధంగా పార్టీ రాష్ట్రశాఖలు తీర్మానాలను ఆమోదించాయి. సెప్టెంబర్ 18న చత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు 310 మంది రాహుల్ గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలని కోరుతూ తీర్మానించగా, గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా యువనేత రాహుల్ గాంధీ దేశ భవిష్యత్ అని, యువతరం గళమని అభివర్ణిస్తూ ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతూ తీర్మానించింది. పార్టీ ప్రతినిధుల రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ భారీ కరతాళ ధ్వనుల మధ్య తీర్మానాన్ని ఆమోదించిందని గుజరాత్ కాంగ్రెస్ విభాగం సమావేశం తరువాత ప్రకటన జారీ చేసింది. తమిళనాడు, బీహార్ కాంగ్రెస్ కమిటీలు కూడా తమ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడుగా రాహుల్‌ను బలపరుస్తూ తీర్మానాలు చేశాయి. సోమవారం మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ పార్టీ శాఖలు రాహుల్‌ను బలపరుస్తూ తీర్మానించాయి.
7 State Units seek Rahul Gandhi as Congress Chief