Monday, January 20, 2025

‘క’న్నీటి సాగుతో ఎండిన కర్షకుని గెండె

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బోనకల్ : గత రెండునెలలుగా సాగు నీటి కోసం ఆందోళనలు చేసినప్పటికి సాగరు అధికారులకు కనికరం కలుగలేదు. అన్నదాతల ఆక్రోశం చూసి చలించిన రెండు గ్రామాల సర్పంచ్‌లు నిరాహార దీక్షకు దిగినా వారి గుండె కరగలేదు. ప్రతిరోజు సాగునీటి కోసం నిద్రాహారాలు మాని కాలువగట్లపై పహారా కాచిన రైతుకు సాగునీరు అందక ఎండిపోయిన మొక్కజొన్న పైరు చూసి గుండెపగిలిపోయింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి గంపెడు ఆశతో పంట సాగుచేసిన అన్నదాతను ఆదుకొనే క్రమంలో నిర్లక్ష్యం చేసిన అధికారుల కారణంగా మండల పరిధిలోని ఆళ్ళపాడు, గోవిదాపురం (ఏ) గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతులు చెందిన 70 ఎకరాల మొక్కజొన్న పంట ఎండిపోయింది. వ్యవసాయాధారంగా జీవించే అనేక మంది నిరుపేదలు పొలాలు కౌలుకు తీసుకొని చేసిన కన్నీటి వ్యవసాయం తీవ్రంగా నష్టం చేకూర్చింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతున్నప్పటికి పుష్కలంగా నిండిన నాగార్జున సాగరు ఆ ఆశాజీవులను సాగుకు సన్నద్దం చేసింది.

రబీ సీజన్‌కు ముందు సాగరు ఉన్నతస్దాయి అధికారులు ఆయకట్టు కింద ప్రతి రైతుకు నీరుఅందిస్తామని పంటలు సాగుచేసుకోవాలని చేసిన ప్రకటనలు నమ్మి సాగుకు దిగిన అనేక మంది రైతులు నిండిమునిగి మునిగిపోయారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాడు సాగునీరు అందక ఇబ్బందిపడిన అన్నదాత ప్రత్యేక రాష్ట్రంతో తమ రాత మారుతుందని ఆశించాడు. కాని రాష్ట్రం సాకారమై దబాబ్దం కావస్తున్నప్పటికి ఈ ప్రాంత రైతులకు ఓనగూడిందేమీలేదని నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఉన్నత స్దాయిలో సాగరు అధికారులలలో లోపించిన సమన్వయం అన్నదాత పాలిట శాపంగా మారింది. ఆందోళనలు చేసినప్పటికి స్పందించన ఆ అధికారులు చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవటానికి కారణమయ్యారు.

రైతుకు ఇంత నష్టం చేసిన వారిని జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నత స్దాయి అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధంకాని పరిస్తితి. సాగుకు సరిపడా మన నీళ్ళు మన చేతిలో ఉన్నా ఎందుకు పొలానికి అందించటంలేదో ఆలోచించేవారు కరవయ్యారు. ఎండిన ఆ పంట మాదిరిగా ఆ రెండు గ్రామాలకు చెందిన బాదిత రైతులు జీవశ్చవాలుగా మారారు. వారికి జరిగిన నష్టం పూడ్చేదెవరు. కనీసం వారి పంటలను పరిశీలించి వారిని ఓదార్చే వారే కరవయ్యారు. ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇక ముందైన పంటలు ఎండకుండా పటిష్టమైన చర్చలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News