Friday, March 21, 2025

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు…70 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా టెల్‌అవీవ్ దళాలు మరోసారి వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. గురువారం ఉదయం గాజా పై ఐటీఎఫ్ వైమానిక దాడుల్లో 70 మంది మృతి చెందినట్టు స్ధానిక అధికారులు తెలిపారు. ఇందులో ఓ మహిళతో సహా అనేక మంది చిన్నారులు ఉన్నట్టు వెల్లడించారు. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ గాజాకు తీవ్ర హెచ్చరికలు చేశారు.

బందీలందరినీ తిరిగి ఇవ్వడానికి ఇదే చివరి అవకాశమని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు నెట్టారిమ్ నడవాలో కొంత భూభాగాన్ని టెల్ అవీవ్ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ నుంచి పాలస్తీనా వాసుల కదలికలను నియంత్రించే వెసులుబాటు దానికి దక్కింది. మంగళవారం గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఇజ్రాయెల్‌హమాస్ మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ ఒప్పందంలో మార్పులు చేయడానికి హమాస్ తిరస్కరించడంతో దాడులకు ఆదేశించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోందని యుద్ధ లక్షాలను సాధించడానికి గాజా లోని హమాస్ స్థావరాలే లక్షంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోందని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటి నుంచి హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది. టెల్‌అవీవ్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మిలిటెంట్ సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News