చండీగఢ్: కెనడాలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించి ఇచ్చిన ఆఫర్ లెటర్లు నకిలీవని తేలడంతో 700 మందికి పైగా భారతీయ విద్యార్థులను దేశం విడిచి వెళ్లవలసిందిగా కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సిబిఎస్‌ఎ) డిపోర్టేషన్ నోటీసులు జారీచేసింది. టోరంటో నుంచి భారతీయ విద్యార్థి షర్మన్ సింగ్ భట్ తమ గాథను ఇండియన్‌నెరేటివ్.కాంకు ఫోన్ ద్వారా వివరించారు. ప్లస్ 2 పాసైన తర్వాత దాదాపు 700 మంది విద్యార్థులు పంజాబ్‌లోని జలంధర్‌లోగల ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ ద్వారా స్టడీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సరీసెస్‌ను బ్రిజేష్ మిశ్రా అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ విద్యార్థుల వీసా దరఖస్తులు 2018లో ఫైల్ అయ్యాయి. అవి 2022 దాకా చెల్లుబాటు కావలసి ఉంటుంది. హంబర్ కాలేజ్ అనే ప్రముఖ విద్యా సంస్థలో అడ్మిషన్ ఫీజుతోసహా అన్ని ఖర్చుల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు మిశ్రా వసూలు చేశాడు. విమాన చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు మాత్రం ఏజెంట్‌కు చెల్లించాల్సిన పైకంలో చేర్చలేదు.
తాను, ఇతర విద్యార్థులు టోరంటోలో దిగిన తర్వాత హంబర్ కాలేజ్‌కు పయనం కాగా త మకు మిశ్రా నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు భట్ తెలిపాడు. హంబర్ కాలేజ్‌లో అన్ని కోర్సులకు చెందిన సీట్లు భర్తీ అయిపోయాయని, 6 నెలల తర్వాత ప్రారంభమయ్యే తదుపరి సెమిస్టర్ వరకు వేచి ఉండాల్సి వస్తుందని మిశ్రా చెప్పాడు. లేని పక్షంలో మరో కాలేజ్‌లో అడ్మిషన్ పొందాల్సి ఉంటుందని, దీని వల్ల సమయం వృథా కాదని అతను చెప్పినట్లు భట్ వివరించాడు. హంబర్ కాలేజ్ కోసం కట్టిన డబ్బును మిశ్రా విద్యార్థులకు వాపసు చేయడంతో విద్యార్థులకు అతని నిజాయితీపై నమ్మకం ఏర్పడింది.
మిశ్రా సూచన మేరకు విద్యార్థులంతా అంతగా పేరు లేని వేరే కాలేజ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులకు అడ్మిషన్లు తీసుకున్నారు. కోర్సులు ప్రారంభమై పూర్తయిన తర్వాత విద్యార్థులకు వర్క్ పర్మిట్లు కూడా లభించాయి. కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ పొందేందుకు అర్హత సాధించడంతో ఈ విద్యార్థులంతా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధిత పత్రాలను సమర్పించారు. ఇక ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైందని భట్ వాపోయాడు. విద్యార్థులకు మంజూరుచేసిన వీసాల ఆధారంగా పత్రాలను పరిశీలించిన సిబిఎస్‌ఎ అడ్మిషన్ ఆఫర్ లెటర్లు నకిలీవని గుర్తించింది. వీరందరికీ డిపోర్టేషన్ నోటీసులు జారీచేసిన సిబిఎస్‌ఎ విద్యార్థులు తమ వాదనలు వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చింది.
మిశ్రా చాలా తెలివిగా తమ వీసా దరఖాస్తులపై ఎక్కడా సంతకం చేయలేదని, ప్రతి విద్యార్థి ఏజెంట్ ద్వారా కాకుండా స్వయంగా తనకు తానుగా దరఖాస్తు చేసినట్లు విద్యార్థి చేతే దరఖాస్తుపై ఏజెంట్ సంతకం చేయించినట్లు భట్ చెప్పాడు. అవి నకిలీ డాక్యుమెమంట్లు కాబట్టే మిశ్రా వాటిపై ఉద్దేశపూర్వకంగానే సంతకం చేయలేదని భట్ పేర్కొన్నాడు. అన్ని పత్రాలను ఏజెంట్ మిశ్రా తయారుచేశాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో విద్యార్థుల నిజాయితీనిగుర్తించడానికి సిబిఎస్‌ఎ అధికారులు నిరాకరించారు.
అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే కెనడియన్ వీసాలు తమకు మంజూరయ్యాయని, ఎయిర్‌పోర్టు అధికారులు కూడా తమను అనుమతించారని విద్యార్థులు వాదిస్తున్నప్పటికీ సిబిఎస్‌ఎ అధికారులు మాత్రం కెనడియన్ ఇమిగ్రేషన్ అధికారుల వైఫల్యాన్ని అంగీకరించడం లేదు. ఇక విద్యార్థులకు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం కెనడా కోర్టులో తమ డిపోర్టేషన్ నోటీసులను సవాలు చేయడం మాత్రమే. ఇది తేలడానికి కనీసం 3, 4 ఏళ్లు పడుతుంది. కెనడాలో న్యాయవాదులను భరించడం కూడా చాలా ఖరీదైన వ్యవహారం. తమ పిల్లలను మోసం చేసిన ఏజెంట్ మిశ్రా కోసం జలంధర్‌లోని అతని కార్యాలయానికి విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు పెట్టగా అది చాలా రోజులుగా మూతపడి ఉంది. ఏం చేయాలో పాలుపోక విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.